కశ్మీర్​లో ఉగ్రవేటకు 'కార్గో' బృందం సై!

author img

By

Published : Oct 12, 2021, 5:35 PM IST

Special Operations Group

జమ్ముకశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్‌ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని నిక్‌నేమ్‌ 'కార్గో'.!

జమ్ముకశ్మీర్‌లో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో అనుభవం ఉన్న కమాండోలతో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్​ను ఏర్పాటుచేసింది. ఈ విభాగాన్ని ముద్దుగా 'కార్గో' అని పిలుస్తున్నారు. ఈ ఏడాది మే వరకు కార్గో బాధ్యతలు చూసిన తాహిర్‌ అష్రఫ్‌ను వేరే విభాగానికి బదిలీ చేశారు. అనంతరం మరొకరికి కార్గో అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. కానీ, తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరగడంతో కార్గో పూర్తి స్థాయి బాధ్యతలను ఎస్పీ హోదాలో ఇఫ్తికార్‌ తాలిబ్‌కు అప్పజెప్పారు. ఆయనకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో ఎస్‌వోజీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు లద్దాఖ్‌ రీజియన్‌లో డిప్యూటేషన్‌పై పని చేశారు. జమ్ము కశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ సేకరణలో కూడా చురుగ్గా వ్యవహరిస్తోంది. దీనిలో మొత్తం 1000 మంది సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు.

ఈ పేరు ఎలా వచ్చింది..

ఒకప్పుడు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కార్గో విభాగంలో ఎస్‌వోజీ ప్రధాన కార్యలయ భవనం ఉంది. అందుకే దీనికి కార్గో అనే పేరు వచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని ఐజీ ర్యాంక్‌ హోదా ఉన్న అధికారి దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ దళం మొత్తాన్ని చిన్న బృందాలుగా చేశారు. ఒక్కో బృందం ఒక్కో రకమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తుంది. కొన్ని బృందాలు ఫోన్‌ ట్రాకింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తుంటాయి. దీంతోపాటు సోషల్‌ మీడియాను పరిశీలించే బృందాలు ఉన్నాయి. హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ సేకరణ కూడా కార్గో చేస్తుంది.

సాధారణంగా చినార్‌ కోర్‌లో భాగమైన రాష్ట్రీయ రైఫిల్స్‌ అత్యధికంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నేతృత్వం వహిస్తుంది. ఒక్క శ్రీనగర్‌ తప్ప మిగిలిన చోట్ల వీటి ఆపరేషన్లకు ఆవసరమైన ఇన్ఫర్మేషన్‌ కార్గో బృందాల నుంచే లభిస్తుంది. జమ్ము కశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో కార్గో బృందాలు ఉన్నాయి. కశ్మీర్‌లోని జిల్లాలో కార్గో దళాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. భారీగా ఉగ్రదాడులు జరిగిన చోట్ల దాదాపు 10 దళాలు పని చేసిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలో వీటికి డీఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తున్నారు. కానీ, వీరందరికి ప్రధాన కార్యలయం మాత్రం శ్రీనగర్లోని కార్గో భవనమే.

ఈ ఎస్‌వోజీ ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లకు వినియోగించే వాహనం కూడా ప్రత్యేకమైందే. ఆపరేషన్‌ జరుగుతున్న ప్రదేశం 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఈ బృందం అపరేషన్‌కు వెళితే అదనపు దళాలను కూడా సిద్ధంగా ఉంచుతారు. ఎస్‌వోజీ గ్రూప్‌ కమాండోలపై ఆరోపణలు రాకుండా బాడీ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు అవసరమైన సమయంలో వైర్‌లెస్‌ సెట్లలో సూచనలు చేస్తారు.

ఉగ్రవాదంలోకి వెళ్లిన యువతను గుర్తించే పనిని కూడా ఈ ఎస్‌వోజీ గ్రూప్‌ చేస్తుంది. హఠాత్తుగా ఎవరైనా యువకుడు అదృశ్యమైన సమాచారం అందిన వెంటనే అతడి గత చరిత్ర, పరిచయాలు వంటి కీలక సమాచారాన్ని తవ్వితీస్తుంది. దీనిని బట్టి అతడు ఏ ఉగ్రబృందంలోని రిక్రూటర్ల ప్రభావానికి లోనైంది గుర్తిస్తోంది. ఈ రకంగా చాలా మందిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చినట్లు మే వరకు కార్గో ఎస్పీగా పనిచేసిన అష్రఫ్‌ పేర్కొన్నారు. ఉగ్ర నియామకాలు చేసే వారు వినియోగించే సోషల్‌ మీడియా కార్యకలాపాలను ఈ గ్రూప్‌ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఎవరైన యువత ఈ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ఉచ్చులో పడినట్లు గుర్తిస్తే వెంటనే వారి తల్లిడంద్రులకు సమాచారం అందజేస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరి ప్రయత్నాలు విఫలమవుతుంటాయి కూడా. అలాంటి సమయాల్లో మాత్రమే ఎన్‌కౌంటర్లు జరుగుతుంటాయని కార్గో బృందం చెబుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.