'యథావిధిగా రైతు నిరసనలు- కొత్త​ డిమాండ్లతో మోదీకి లేఖ'

author img

By

Published : Nov 21, 2021, 2:32 PM IST

Updated : Nov 21, 2021, 2:53 PM IST

farmers meeting

సాగు చట్టాల రద్దు(Farm laws repeal), భవిష్యత్తు కార్యాచరణపై సింఘు సరిహద్దులో సమావేశమయ్యారు సంయుక్త కిసాన్​ మోర్చా(Samyukta Kisan Morcha) నేతలు. సుదీర్ఘంగా చర్చించి.. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. పెండింగ్​లో ఉన్న అంశాలపై మోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు.

రైతుల నిరసనల్లో(Farmers protest) భాగంగా ఈనెల 29న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్​ మార్చ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు సంయుక్త కిసాన్​ మోర్చా(Samyukta Kisan Morcha) నేతలు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం కానున్నట్లు తెలిపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు(Farm laws repeal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM modi news) ప్రకటించినప్పటికీ రైతులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

​సింఘు సరిహద్దులో(Singhu Border) సమావేశమైన నేతలు సుదీర్ఘంగా చర్చించి రైతు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు బల్బీర్​ సింగ్​ రజెవాల్​. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే, చాలా విషయాలు పెండింగ్​లో ఉన్నాయని గుర్తు చేశారు.

"వ్యసాయ చట్టాల రద్దుపై చర్చించాం. ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈనెల 22న లఖ్​నవూలో కిసాన్​ పంచాయత్​, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంట్​కు ర్యాలీగా తరలివెళ్లటం వంటివి ఉన్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం అవుతాం."

- బల్బీర్​ సింగ్​ రజెవాల్​, రైతు నేత

ఎంఎస్​పీ కమిటీ, విద్యుత్తు బిల్లు 2020, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపారు బల్బీర్​ సింగ్​. లఖింపుర్​ ఖేరి హింస కేసులో భాగంగా కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేయానున్నట్లు తెలిపారు.

లఖ్​నవూలో మహాపంచాయత్​..

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. చాలా అంశాలు పెండింగ్​లో ఉన్నాయని పేర్కొంది సంయుక్త కిసాన్​ మోర్చా. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో సోమవారం కిసాన్​ మహాపంచాయత్​(kisan mahapanchayat) నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నగరంలోని ఎకో గార్డెన్​లో నిర్వహించాలని కొద్ది నెలల ముందే ప్రణాళిక చేసినట్లు తెలిపింది. ఎంఎస్​పీపై చట్టం తీసుకురావటం, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను విధుల నుంచి తొలగించటం వంటివి చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు రైతు నేతలు. 'ఎంఎస్​ చట్టం కోసం మహాపంచాయత్​లో పాల్గొనేందుకు ఛలో లఖ్​నవూ. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం చెప్పేవన్నీ ఉట్టి మాటలే. వాటి వల్ల రైతుల పరిస్థితి ఏమి మారదు. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ' అని పేర్కొన్నారు భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​.

ఇదీ చూడండి: ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు

Last Updated :Nov 21, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.