సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు.. 'చనిపోయినా సరే.. ఎవరికీ లొంగను'

author img

By

Published : Jul 31, 2022, 11:29 AM IST

Sanjay raut ED

Sanjay raut ED: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్​ వేదికగా ఈ దాడులపై స్పందించారు సంజయ్ రౌత్. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులని విమర్శించారు.

Sanjay raut ED: శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించడం గమనార్హం.

Sanjay raut ED
సంజయ్ రౌత్ నివాసం వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
"ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా" అని ట్వీట్‌ చేశారు.

Sanjay raut ED
సంజయ్ రౌత్ ట్వీట్లు

రౌత్‌ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్‌ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్‌ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు.
సంజయ్ రౌత్‌ను జులై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు. పాత్రచాల్​ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్‌ సహా, మరికొంతమంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పాత్రచాల్​ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఇవీ చదవండి: 'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్​.. తిరుగులేని సాక్ష్యం కాదు'

టమాట తిని మహిళ మృతి... అదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.