డ్రగ్స్ కేసులో ఆర్యన్​ఖాన్​కు పరిహారం చెల్లించాలా?

author img

By

Published : May 29, 2022, 3:35 AM IST

ఆర్యన్​ ఖాన్

Drugs Case Aryan Khan: దేశంలో సంచలనం సృష్టించిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో 20 రోజులకు పైగా జైలులో గడిపిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు శుక్రవారం క్లీన్‌చిట్‌ లభించింది. ఈ నేపథ్యంలో అతడు జైలులో గడిపిన కాలానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

Drugs Case Aryan Khan: దేశవ్యాప్తంగా చేయని తప్పునకు అనేకమంది జైలులో మగ్గుతున్నారు. ఆ తర్వాత వారు నిర్దోషులుగా బయటపడినా కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా వారికి పరిహారం లభించడంలేదు. అదే కోవలోకి వస్తాడు షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్ కూడా‌. గతేడాది అక్టోబర్‌లో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ముంబయి తీరంలోని క్రూజ్‌ నౌకలో ఆర్యన్‌ను ఎన్సీబీ అరెస్టు చేయడం సంచలనమైంది.

దీంతో 20 రోజులకు పైగా అతడు జైలులోనే ఉండాల్సి వచ్చింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఆర్యన్‌తో పాటు మరో ఐదుగురిపై అభియోగాలు మోపలేదని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మందిపై ముంబయిలో కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసినట్టు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆర్యన్‌పై అభియోగాలు నిరూపించగలిగే బలమైన భౌతిక ఆధారాలేమీ లభించలేదని ఎన్సీబీ చీఫ్‌ స్పష్టంచేశారు.

మరోవైపు, ఆర్యన్‌ ఖాన్‌ నిర్దోషిగా తేలడంపై ఎన్‌సీపీ హర్షం ప్రకటించింది. అయితే, కేసు నమోదు కావడంతో షారుక్‌ తనయుడు అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆ పార్టీ ప్రశ్నించింది. భారత రాజ్యాంగం ప్రకారం తప్పుడు జైలు శిక్ష అనేది ఆర్టికల్‌ 21, 22కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు రాజ్యాంగంలో కొన్ని నిబంధనలూ ఉన్నాయి. అయితే, అలాంటి పరిహారం సంపూర్ణమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా అమలులో కూడా లేదు. యూకే, జర్మనీ, అమెరికా, కెనడా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని దేశాలు మాత్రం తప్పుడు అరెస్టు విషయంలో పరిహారం పొందేందుకు చట్టబద్ధమైన హక్కులను రూపొందించాయి.

ఇవీ చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్​కు క్లీన్​చిట్​

మరుగుజ్జుల పెళ్లి.. 36 అంగుళాల వరుడు.. 31 అంగుళాల వధువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.