చెవి నొప్పితో వెళితే చేయి కట్​.. మూడు నెలల్లో జరగాల్సిన పెళ్లి రద్దు

author img

By

Published : Sep 1, 2022, 4:45 PM IST

Etv Bharat

Doctor Gave Wrong Medication : వైద్యుల నిర్లక్ష్యం.. ఓ యువతి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టింది. చెవి నొప్పితో వెళ్లిన ఆ యువతికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. వాళ్లు చేసిన వైద్యం వికటించడం వల్ల 20 ఏళ్ల రేఖ తన ఎడమ చేయిని కోల్పోయింది.

Doctor Gave Wrong Medication : చెవినొప్పి అంటూ వెళ్లిన యువతికి శస్త్రచికిత్స చేశారు ఓ ఆస్పత్రి వైద్యులు. అనంతరం ఇంజక్షన్​ను ఇచ్చి పంపించారు. చేయి నొప్పి పెడుతోందని చెప్పినా పట్టించుకోలేదు. వైద్యులు నిర్లక్ష్యంగా చేసిన వైద్యం వికటించడం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. చివరకు ఆమె ఎడమ చేయిని మోచేతి వరకు తొలగించి.. ప్రాణాలు కాపాడారు వైద్యులు. ఈ దారుణ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది.

శివహర్​ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవి నొప్పితో పట్నాలోని మహావీర్​ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. జులై 11న శస్త్రచికిత్స నిర్వహించి మందులు రాశారు. అనంతరం వైద్యులు సూచించిన ఇంజక్షన్​ను యువతికి ఇచ్చింది నర్స్​. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రేఖకు.. ఎడమ చేయి రంగు మారడమే కాకుండా నొప్పి కూడా మొదలైంది. దీంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రందించగా.. వారు సరిగ్గా స్పందించలేదు. కొద్ది రోజులకు అదే నయం అవుతుందని సర్దిచెప్పి పంపించేశారు. ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడం వల్ల అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగింది రేఖ. పట్నాలోని ఆస్పత్రులతో పాటు దిల్లీలోని ఎయిమ్స్​కు వెళ్లినా.. నొప్పి తగ్గలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల చివరగా పట్నాలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 4న శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. రేఖ ఎడమ చేయిని మోచేతి వరకు తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు.

doctor gave wrong medication
శస్త్రచికిత్స అనంతరం రేఖ

అయితే, రేఖకు నవంబర్​లో వివాహం జరగనుందని.. ఆమె చేయిని తొలగించడం వల్ల వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకొని వెళ్లారని ఆమె సోదరి రోషిని బాధపడింది. చేయిని తొలగించడం వల్ల తన సోదరి మనస్తాపానికి లోనైందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి కారణమైన మహావీర్ సంస్థాన్​ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేస్తోంది.

"రేఖ చెవి నొప్పితో బాధపడుతూ మహావీర్​ ఆరోగ్య సంస్థాన్​ ఆస్పత్రికి వెళ్లగా.. చిన్నపాటి శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు మందులు రాయగా.. నర్స్​ వచ్చి ఇంజక్షన్​ చేసింది. ఆ తర్వాత నుంచి రేఖ ఎడమ చేయి రంగు మారింది. నొప్పి మొదలైంది. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. ఆ తర్వాత వేరే ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవరు చేర్చుకోలేదు. చివరకు పట్నాలోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎడమ చేయిని సగం తొలగించారు. వాళ్లు అప్పుడే పట్టించుకుంటే నా సోదరి చేయి తొలగించేవారు కాదు."

- రోషిని, రేఖ సోదరి

దీనిపై మహావీర్​ ఆరోగ్య సంస్థాన్​ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. రేఖ అవయవ మార్పిడికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లను దిల్లీలోని మాక్స్​ ఆస్పత్రిలో పూర్తిచేశామని మహావీర్ ఆస్పత్రి డైరెక్టర్​ విమల్​ తెలిపారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. యువతి ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం సంస్థ ఖర్చులతోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేయిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వైద్యుడు, నర్స్​ను విధుల నుంచి తొలగించామని చెప్పారు.

న్యాయస్థానానికి వెళ్లనీయకుండా ఆస్పత్రి యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు బాధితురాలి తరఫు న్యాయవాది రూపం. రేఖకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుతం ఆమెను తన సోదరి రోషిని చూసుకుంటోందని.. రోషినికి వివాహం జరిగితే రేఖ ఒంటరి అవుతోందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దీనిపై కోర్టుకు వెళతామని.. తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: గణేశుడికి ఒకేసారి 31వేల మంది మహిళల స్వరార్చన

ఒక్కసారిగా బరువు పెరిగిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.