అండర్ వరల్డ్ డాన్ దావూద్​పై రూ.25 లక్షల రివార్డ్

author img

By

Published : Sep 1, 2022, 1:18 PM IST

Dawood Ibrahim

Dawood Ibrahim NIA : అండర్ ​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది ఎన్​ఐఏ. అతని ముఖ్య అనుచరుడు చోటా షకీల్ తలపై రూ.20 లక్షల నజరానా ప్రకటించింది. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడు.

Dawood Ibrahim NIA : పరారీలో ఉన్న అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్‌ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి రూ.25 లక్షలు రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రకటించింది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ కీలక నిందితుడిగా ఉన్నాడు. దావూద్‌ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ చెబితే రూ.20 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్​ఐఏ పేర్కొంది. అనీస్ ఇబ్రహీం, జావెద్‌ చిక్నా, ఇబ్రహీం ముస్తాక్‌, టైగర్ మెమన్‌ల వివరాలు చెప్పిన వారికి ఒక్కొక్కరికీ రూ.15 లక్షల రివార్డు ఇస్తామని తెలిపింది.

వీరందరూ 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. వారిని అరెస్ట్‌ చేసేలా సమాచారం ఇచ్చిన వారికి.. ఈ మేరకు నగదు బహుమతి అందిస్తామని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. వీరందరూ అనేక తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు చెప్పారు. దావూద్‌ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా 'డి కంపెనీ'పై ఎన్‌ఐఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఆయుధాల స్మగ్లింగ్‌, నార్కో టెర్రరిజం, అండర్‌ వరల్డ్‌ క్రిమినల్‌ సిండికేట్‌, మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోందని ఎన్‌ఐఏ పేర్కొంది. పాక్‌ ఆధారంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు కీలక సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే దావూద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్‌ పేరు కరాచీ అడ్రసుతో ఉంది.
1993లో దేశ వాణిజ్య రాజధాని ముంబయివ్యాప్తంగా 12 చోట్ల గంటల వ్యవధిలో భీకర బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.

ఇవీ చదవండి: మార్కులు వేయలేదని టీచర్​ను చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్​

వరద బాధితుల పడవ బోల్తా.. 20 మందికి పైగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.