అగ్నిపథ్​పై కాంగ్రెస్​ 'సత్యాగ్రహం'.. రాజ్​నాథ్​ ఉన్నతస్థాయి సమీక్ష

author img

By

Published : Jun 19, 2022, 1:00 PM IST

Congress protest

అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టింది కాంగ్రెస్​. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సచిన్​ పైలట్​ సహా పలువులు ఎంపీలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే త్రివిధ దళాధిపతులతో అగ్నిపథ్​పై మరోమారు సమీక్ష నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువత, విపక్ష పార్టీలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు చేస్తున్న యువతకు సంఘీభావంగా దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టింది కాంగ్రెస్​. ఈ దీక్షలో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సచిన్​ పైలట్​ సహా పలువురు కీలక నేతలు, కాంగ్రెస్​ ఎంపీలు, వర్కింగ్​ కమిటీ సభ్యులు, ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ నుంచి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పాల్గొన్నారు.

Congress protest
దీంక్షలో ప్రియాంక గాంధీ

మోదీపై రాహుల్​ విమర్శలు: అగ్నిపథ్​పై నిరసనలు చేస్తున్న యువతకు సంఘీభావంగా కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్ష చేపట్టిన క్రమంలో మరోమారు ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. ఉద్యోగాలంటూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ నిరుద్యోగమనే అగ్నిమార్గంలో యువత నడిచేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

"పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పిస్తూ.. దేశంలోని యువతను నిరుద్యోగం అనే 'అగ్నిపథం'లో నడవాలని ప్రధాని ఒత్తిడి చేస్తున్నారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా.. దేశంలోని యువత పకోడీ చేయటంలోనే నైపుణ్యం సాధించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు కేవలం ప్రధాని ఒక్కరిదే బాధ్యత. నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని పార్టీ నేతలను కోరుతున్నా. నిరసనలు చేస్తున్న యువతకు కాంగ్రెస్​ కార్యకర్తలు అండగా నిలవాలి. "

- రాహుల్​ గాంధీ.

రాజ్‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష: అగ్నిపథ్‌ పథకంపై వ్యతిరేకత దృష్ట్యా కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ.. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి ఉద్యోగార్థులు వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారమూ సైనిక ఉద్యోగార్థులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇలా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఆయన సమావేశం నిర్వహించడం గమనార్హం. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ, హోంశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం సమీక్ష నిర్వహించిన అనంతరం సైన్యంలో చేరి నాలుగేళ్లు పూర్తిచేసుకున్న 'అగ్నివీర్‌'లకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో, అసోం రైఫిల్స్‌లో 10 శాతం పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమోదం తెలిపారు. తీరగస్తీ దళంలో, రక్షణ రంగ సివిలియన్‌ పోస్టుల్లో, ఈ రంగానికి చెందిన 16 ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా 10% రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన కార్యాలయం తెలిపింది. మాజీ సైనికుల కోటాకు ఇది అదనమని, నియామక నిబంధనల్లో ఈ మేరకు సవరణలు చేయనున్నామని ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనన్న చర్చ ప్రారంభమైంది.

ఇదీ చూడండి: అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​.. వాయుసేన కీలక ప్రకటన!

ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.