కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గహ్లోత్.. 'ఆయన రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంటే'

author img

By

Published : Sep 23, 2022, 12:24 PM IST

Updated : Sep 23, 2022, 4:18 PM IST

Rajasthan CM Ashok Gehlot

Congress President election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. ఫలితం ఏదైనా కాంగ్రెస్​ను బలమైన విపక్షంగా తీర్చిదిద్దుతామని గహ్లోత్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఈ పదవిని చేపట్టడం లేదని తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియపై భాజపా విమర్శలు వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి ప్రతినిధిగానే ఉంటారని చెప్పుకొచ్చింది.

Congress President election : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఈ మేరకు గతకొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. ఫలితం ఏదైనా.. పార్టీని ఏకం చేసేందుకు తాను కృషి చేస్తానని గహ్లోత్ వివరించారు. కాంగ్రెస్​ను బలమైన విపక్షంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్థాన్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన కొచ్చిలో విలేకరులతో మాట్లాడారు.

"నామపత్రాలు ఎప్పుడు దాఖలు చేయాలో రాజస్థాన్ వెళ్లాక నిర్ణయిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఇతర కాంగ్రెస్​ మిత్రులు సైతం బరిలో దిగవచ్చు. కానీ, పార్టీని అన్ని స్థాయులలో బలోపేతం చేసి ఐకమత్యం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బలమైన విపక్షం అవసరం. ఫలితాలు వచ్చాక అందరం కలిసే పనిచేసుకుంటాం."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం

గాంధీ కుటుంబం దూరం
తదుపరి పార్టీ సారథిగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఉండబోరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గహ్లోత్ తెలిపారు. 'అధ్యక్ష పదవిని స్వీకరించాలని రాహుల్​ను కోరా. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు ఇదే కోరుకుంటున్నాయని చెప్పా. కానీ తదుపరి అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఉండబోరని రాహుల్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అందువల్ల గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పదవి పోటీలో ఉండరు' అని గహ్లోత్ వివరించారు.

'ఒక వ్యక్తికి ఒకే పదవి'పై రభస..
కాంగ్రెస్​ పార్టీ ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవిలో ఉండాలని తీర్మానించింది. గహ్లోత్.. పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందితే తన ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం వదులుకునేందుకు ఆయన ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గహ్లోత్.. ఈ చర్చ అనవసరమని అన్నారు. 'నేను పదవి వదులుకోవడానికి ఇష్టపడట్లేదని మీడియానే చెబుతోంది. నేను ఎప్పటికప్పుడు మౌనంగానే ఉన్నా. రాజస్థాన్ ప్రజలకు ఎప్పటికీ సేవ చేస్తూనే ఉంటానని నేను గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. ఇందులో తప్పేముంది? దీనికి పలువురు పలు రకాలుగా అర్థాలు తీస్తున్నారు. మీడియా వాటిని వల్లెవేస్తోంది' అని గహ్లోత్ పేర్కొన్నారు.

పోటీ చేయట్లేదు: డిగ్గీరాజా..
కాగా, పార్టీ అధ్యక్ష రేసులో తాను లేనని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. థరూర్, గహ్లోత్​తో పాటు దిగ్విజయ్ సైతం పోటీ చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. వీటిపై స్పష్టతనిచ్చిన దిగ్విజయ్.. ఎన్నికల్లో పోటీ చేయనని, అధిష్ఠానం ఇచ్చే ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.

శశిథరూర్​కు చురకలు..
మరోవైపు, అధ్యక్ష పదవికి శశిథరూర్ పోటీ పడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనారోగ్యంతో ఆస్పత్రి ఉన్న సోనియా గాంధీకి లేఖ రాయడమే శశిథరూర్ పార్టీకి చేసిన పెద్ద సేవ అని ఎద్దేవా చేశారు. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే తమ తొలి ప్రాధాన్యమని.. ఆయన పోటీలో లేకుంటే ఎవరిని ఎన్నుకోవాలో తమకు స్పష్టత ఉందని చెప్పుకొచ్చారు. "అశోక్ గహ్లోత్​కు కేంద్ర మంత్రిగా, మూడుసార్లు సీఎంగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా విశేష అనుభవం ఉంది. మోదీ-షా ద్వయాన్ని నేరుగా ఎదుర్కొని వారిని ఓడించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరకలు లేవు. మరోవైపు, సోనియాకు శశిథరూర్ లేఖ రాసి కోట్లాది మంది పార్టీ కార్యకర్తలకు బాధ కలిగించారు. గడిచిన ఎనిమిదేళ్లలో పార్టీకి ఆయన చేసిన గొప్ప మేలు అదే" అని ట్వీట్ చేశారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ వీటిని ఖండించింది. పార్టీ ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సూచించారు. 'ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉంటాయి. కానీ, ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందని చాటడమే మన ఉద్దేశమై ఉండాలి' అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

'రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడే'
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై భాజపా విమర్శలు గుప్పించింది. కొత్త అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి ప్రతినిధిగానే ఉంటారని చెప్పుకొచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​లా.. పార్టీకి రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు వస్తారని పేర్కొంది. 'రాజస్థాన్ సీఎం ఎవరో సోనియా గాంధీ, అజయ్ మాకెన్ తేలుస్తారని గహ్లోత్ అంటున్నారు. ఒకవేళ గహ్లోత్ గెలిస్తే.. సోనియా మాజీ అధ్యక్షురాలు అవుతారు. అప్పుడు ఏ అధికారంతో సీఎంపై నిర్ణయం తీసుకుంటారు? తదుపరి అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా.. రాహుల్ గాంధీకి పార్టీలో కీలక స్థానం ఉంటుందని చిదంబరం చెబుతున్నారు. గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడిని కోరుకుంటే ఈ ఎన్నికలు ఎందుకు?' అని భాజపా జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఎంపీ శశిథరూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించిన రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.

Last Updated :Sep 23, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.