బోరు బావిలో పడి బాలుడు మృతి.. కోతులకు భయపడి పరుగెడుతూ..

author img

By

Published : Mar 15, 2023, 8:07 AM IST

Updated : Mar 15, 2023, 1:44 PM IST

child fell in 60 feet borewell

ఓ ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 60 అడుగుల లోతైన బోరు బావిలో పడి మృత్యువాత పడ్డాడు. తోటి స్నేహితులతో ఆటలాడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారి ఈ ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుకున్న అధికార యంత్రాంగం.. బాలుడిని రక్షించేందుకు 5 జేసీబీలతో తవ్వకాలు చేపట్టి అతడిని బయటకు తీశాయి. అనంతరం ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

మధ్యప్రదేశ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. బోరు బావిలో పడ్డ ఓ ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ 60 అడుగుల బావిలో పడిన బాలుడిని.. అనేక గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు అధికారులు. అనంతరం పిల్లాడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతిపై సమాచారం అందుకున్న సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ బాధిత కుటుంబసభ్యులకు​ రూ.4లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విదిశా జిల్లాలోని లటేరీ ప్రాంతంలోని ఆనంద్​పుర్​ గ్రామానికి చెందిన లోకేశ్​ అహిర్వార్​(7) ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం లోకేశ్​ తోటి స్నేహితులతో కలిసి పొలాల్లో ఆడుకోవడానికి వెళ్లాడు. అయితే వారంతా ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా ఆ ప్రాంతానికి ఓ కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసిన ఆ చిన్నారులు.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి తలో దిక్కు పరిగెత్తారు. లోకేశ్​ కూడా తనకు ఎదురుగా ఉన్న కొత్తిమీర పొలంవైపుగా పరిగెత్తడం ప్రారంభించాడు. తాను ఆగితే కోతులు ఎక్కడ తనను కరిచేస్తాయో అన్న భయంతో కింద కూడా చూసుకోకుండా పరుగుపెట్టాడు. దీంతో ఈ కొత్తమీర పొలంలో తెరచి ఉన్న.. 2 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన ఓ బోరు బావిలో పడిపోయాడు. లోకేశ్​ బావిలో పడిపోవడాన్ని గమనించిన తోటి స్నేహితులు వెంటనే గ్రామంలోనికి చేరుకుని.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున లోకేశ్​ను రక్షించడానికి అక్కడకి చేరుకున్నారు. వీరితో పాటుగా లోకేశ్​ తల్లిదండ్రులు కూడా కుమారుడు ప్రమాదానికి గురైన ప్రాంతానికి చేరుకున్నారు. బాలుడు తండ్రి రోజువారీ కూలి పనులు చేస్తారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

child fell in 60 feet borewell
సీసీటీవీ ద్వారా లోకేశ్​ కదలికలు గుర్తిస్తున్న అధికారులు

ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు బృందాలతో పాటుగా మూడు ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు, ఓ​ ఎన్​డీఆర్​ఎఫ్ బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడకు చేరుకున్న సిబ్బంది వెంటనే లోపల ఉన్న చిన్నారి కోసం పైపుల ద్వారా ఆక్సిజన్​ను సరఫరా చేశారు. అనంతరం లోకేశ్ కదలికలను గమనించడానికి సీసీటీవీని లోపలికి పంపించారు. దీంతో పాటుగా లోకేశ్​తో మాట్లాడే ప్రయాత్నాలు కూడా చేశారు. కానీ ఆ బాలుడు మట్లాడే పరిస్థితిలో లేడని అధికారులు తెలిపారు.

చిన్నారిని రక్షించేందుకు 11:30 గంటల నుంచి 5 జేసీబీలతో.. ఆ బోరు బావి చుట్టూ తవ్వడం ప్రారంభించారు. దాదాపు 24 గంటలు కష్టపడి సహాయక సిబ్బంది.. బోరు బావికి పక్కన దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వారు. ఆ తర్వాత అక్కడ నుంచి సొంరంగ మార్గం ఏర్పాటు చేసి లోకేశ్​ను బయటకు తీశారు. అనంతరం పిల్లాడిని 14 కిలోమాటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్​ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో లోకేశ్​ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బాలుడి మృతి పట్ల సంతాపం తెలిపారు. రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ విషయాన్ని విదిశా జిల్లా కలెక్టర్ ఉమా శంకర్ భార్గవ్​ వెల్లడించారు.

Last Updated :Mar 15, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.