'వారికి ముందుగానే రెండో డోసు'

author img

By

Published : Jun 8, 2021, 6:53 AM IST

విదేశాలకు వెళ్లేవారికి కొవిషీల్డ్

విదేశాలకు వెళ్లే విద్యార్థులు, క్రీడాకారులకు 84 రోజుల కంటే ముందే కొవిషీల్డ్‌ టీకా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

విద్య, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు, టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల కోసం వెళ్లే క్రీడాకారులకు 84 రోజులకు ముందే కొవిషీల్డ్‌ రెండో డోస్‌ టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సోమవారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే ఈ టీకా మొదటి డోసు తీసుకొని ఉండి, రెండో డోసు తీసుకోవడానికి ఉన్న 84 రోజుల గడువులోపు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిన వారికి అంతకుముందే రెండో డోసు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇలాంటి వారికి టీకాల కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. కొవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి వారి విషయంలో సంబంధిత పత్రాలను పరిశీలించాలని పేర్కొంది.

  • విదేశీ విద్యకు సంబంధించి విద్యార్థులకు వచ్చిన ప్రవేశ లేఖ లేదా అందుకు సంబంధించిన అధికారిక సమాచారం చూపాలి.
  • ఒకవేళ విద్యార్థి ఇప్పటికే విదేశాల్లో చదువుతూ ఉండి, చదువు కొనసాగించడానికి మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటే ఈ సౌకర్యం కల్పించాలి.
  • ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కాల్స్‌ లేదా ఆఫర్‌ లెటర్‌ వచ్చిన వారికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో పాలుపంచుకోవడానికి నామినేషన్‌ ఉన్నవారికి అందించాలి.
  • టీకా తీసుకోవడానికి పాస్‌పోర్టునూ గుర్తింపు కార్డుగా అనుమతించినందున, తాజా మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి వారికి అందించే టీకా ధ్రువీకరణపత్రంలో పాస్‌పోర్టు నెంబర్‌ కూడా ఉండేలా చూస్తారు. మొదటి డోసు తీసుకునేటప్పుడు పాస్‌పోర్టును ఉపయోగించకపోతే, ఆ సమయంలో ఇచ్చిన ఫొటో గుర్తింపు కార్డు వివరాలను టీకా ధ్రువీకరణపత్రంపై ముద్రిస్తారు. అందువల్ల టీకా ధ్రువీకరణపత్రంపై పాస్‌పోర్ట్‌ నెంబర్‌ కోసం ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఎక్కడైనా అవసరం అనిపిస్తే సంబంధిత అధీకృత అధికారి లబ్ధిదారుడి పాస్‌పోర్టు నెంబర్‌ను జతచేస్తూ టీకా ధ్రువీకరణపత్రం జారీ చేయవచ్చు.
  • ఆగస్టు 31వ తేదీవరకు ప్రత్యేక అవసరాలకోసం అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చూడండి: కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.