రాజీవ్‌ హత్య కేసు దోషుల విడుదల.. సుప్రీంలో కేంద్రం పిటిషన్‌

author img

By

Published : Nov 17, 2022, 10:23 PM IST

Updated : Nov 17, 2022, 10:45 PM IST

Centre petition in Supreme Court

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషులను విడుదల చేయడంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషులను విడుదల చేయడంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. ఈ మేరకు కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని పేర్కొంది. ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది.

గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, మాజీ ప్రధానిని హత్యచేసి ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అవకాశముందని తెలిపింది.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళనాడులోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారంతా విడుదలయ్యారు. దోషుల ప్రవర్తన కారాగారంలో సంతృప్తికరంగా ఉన్నందున వారి శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్టును కోరింది.

ఇదే కేసులో 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించిన పేరరివాలన్‌ విడుదలకు రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 18న ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో నళినితో పాటు ఆమె భర్త వి.శ్రీహరన్‌ అలియాస్‌ మురుగన్‌, రవిచంద్రన్‌, సంథన్‌, రాబర్ట్‌ పాయస్‌, జయకుమార్‌ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు.

Last Updated :Nov 17, 2022, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.