ETV Bharat / bharat

'భారత్​లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం'

author img

By

Published : Jul 20, 2020, 9:37 PM IST

ప్రపంచం మందగమనంలో ఉన్న సమయంలో భారత్​లో మాత్రం ఎఫ్​డీఐలు పెరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్​ వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేని వైద్య వ్యవస్థ అందించే విధంగా దేశం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణతో పలు విషయాలపై చర్చించారు.

Great time to invest in India: PM tells IBM CEO
మోదీ

ప్రపంచం మొత్తం మందగమనంలో ఉంటే భారత్​లో మాత్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తగిన సమయమని మోదీ ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులకు దేశం సాదరస్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణతో ప్రధాని మోదీ ఆన్​లైన్​ ద్వారా సంభాషించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. స్వయం సమృద్ధి సాధించాలన్న కళ సాకారం చేసుకునే దిశగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపింది. దీని వల్ల దేశంలో సమర్థవంతమైన, అంతరాయం లేని సప్లై చైన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని మోదీ వెల్లడించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

75 శాతం ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసుకునే విధంగా ఐబీఎం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై మోదీ మాట్లాడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురయ్యే సవాళ్లపై చర్చించినట్లు పేర్కొంది. ప్రత్యేకంగా భారత్​లోని వైద్య వ్యవస్థ కోసం కృత్రిమ మేధ ఆధారిత పరికరాలు తయారు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలపై మోదీ చర్చించినట్లు వెల్లడించింది.

వైద్య వ్యవస్థలో వేగంగా అడుగులు

ఈ సందర్భంగా కరోనా ప్రభావంపై మాట్లాడిన మోదీ.. వర్క్​ ఫ్రం హోమ్ సంస్కృతిని వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున అవలంబిస్తున్నాయని అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సాంకేతిక మార్పులు, రెగ్యూలేటరీ వాతావరణం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని సాంకేతిక, డేటా ఆధారిత ఇంటిగ్రేటెడ్ వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా దేశం అడుగులు వేస్తోందని మోదీ నొక్కి చెప్పారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఐబీఎం సంస్థకు ఉందని మోదీ పేర్కొన్నారు.

మీ సహకారం భేష్

సీబీఎస్​ఈ సహకారంతో 200 పాఠశాలల్లో ఏఐ ఆధారిత పాఠ్యాంశాలను ప్రారంభించడంలో ఐబీఎం పోషించిన పాత్రను మోదీ ప్రశంసించారు. విద్యార్థులకు ప్రారంభ దశల్లోనే ఏఐ, మెషిన్ లెర్నింగ్​ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఐబీఎం గ్లోబల్ హెడ్​గా నియమితులైన కృష్ణను ప్రధాని అభినందించారు. భారత్​తో ఐబీఎంకు బలమైన బంధం ఉందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో లక్ష మందికిపైగా ప్రజలు ఐబీఎంలో పనిచేస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి- ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడం కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.