ETV Bharat / bharat

4,442 మంది ప్రజా 'నేత'లపై క్రిమినల్​ కేసులు

author img

By

Published : Sep 9, 2020, 3:46 PM IST

రాజకీయ నేతల నేర చరిత్రపై కొత్త విషయం బయటకువచ్చింది. దేశవ్యాప్తంగా 4,442మంది ప్రజా ప్రతినిధులు క్రిమినల్​ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో 2,556మంది సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలే. నేతలపై ఉన్న క్రమినల్​ కేసుల్లో విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ హైకోర్టులు దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయం బయటకువచ్చింది.

Former, serving lawmakers facing trials in 4,442 cases, says HC data
4,442మంది ప్రజా 'నేత'లపై క్రిమినల్​ కేసులు

దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో 4,442మంది క్రిమినల్​ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో 50శాతానికిపైగా( 2,556)మంది ప్రస్తుతం.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా సేవలందిస్తుండటం గమనార్హం. దేశంలోని వివిధ హైకోర్టులు.. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికల ద్వారా ఈ విషయం బయటపడింది.

"హైకోర్టులు సమర్పించిన నివేదికల ప్రకారం.. మొత్తం 4,442 కేసులు పెండింగ్​లో ఉన్నాయి. వీటిలో 2,556 కేసుల్లో ప్రస్తుత చట్టసభ్యులు నిందితులుగా ఉన్నారు. కేసులకన్నా.. నేర చరిత్ర ఉన్న చట్టసభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఒక కేసులో.. ఒకరికన్నా ఎక్కువ మందిపై ఆరోపణలు ఉండటం, ఓ కేసులో నిందితుడిగా ఉన్న చట్టసభ్యుడు మరో కేసులోనూ విచారణ ఎందుర్కొంటుండటం ఇందుకు కారణం."

--- హైకోర్టుల నివేదిక​.

చట్టసభ్యులపై ఉన్న క్రిమినల్​ కేసుల విచారణను వేగవంతం చేయాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్​ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని హైకోర్టులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులు నివేదికలను సుప్రీంకు పంపించాయి.

ఆ నివేదికల ప్రకారం... 352 కేసులపై సుప్రీంకోర్టు, హైకోర్టులు స్టే విధించాయి. నేరం రుజువు అయితే.. జీవిత ఖైదు శిక్ష పడే కేసులు 413. వీటిలో 174 మంది ప్రస్తుత చట్టసభ్యులు నిందితులుగా ఉన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ టాప్​...

1,217 పెండింగ్​ కేసులతో ఉత్తర్​ప్రదేశ్​ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. ఇందులోని 446 కేసుల్లో ప్రస్తుత చట్టసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిహార్​లో 531కేసులు విచారణ దశలో ఉండగా.. అందులోని 256కేసుల్లో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులగా ఉన్నారు.

ఇదీ చూడండి:- చట్టసభల్లో నేర చరితుల ఉరవడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.