ETV Bharat / bharat

'సంక్షోభాన్ని స్వలాభానికి వాడుకుంటున్న ప్రభుత్వమిది'

author img

By

Published : Jul 25, 2020, 11:59 AM IST

కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. లాక్​డౌన్​ సమయంలో వలసకూలీలను స్వస్థలాలకు చేర్చడం ద్వారా రైల్వేలు రూ.428 కోట్ల ఆదాయం సంపాదించడంపై మండిపడ్డారు. కరోనా వంటి సంక్షోభాన్ని ప్రభుత్వం లాభాలను సమకూర్చుకునేందుకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

rahul
'సంక్షోభాన్ని లాభాల కోసం వాడుకున్న ప్రభుత్వమిది'

మోదీ సర్కార్​పై మరోసారి మాటల దాడి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. "పేదల వ్యతిరేక ప్రభుత్వం" కరోనావైరస్ మహమ్మారిని లాభాల కోసం ఉపయోగించుకుంటోందని ట్విట్టర్​ వేదికగా ఆరోపణలు చేశారు. శ్రామిక్​ రైళ్ల​ ద్వారా వలసకూలీలను స్వస్థలాలకు చేర్చి భారతీయ రైల్వే రూ.428 కోట్ల ఆదాయం సంపాదించుకున్నట్లు వచ్చిన ఓ న్యూస్​పేపర్​ క్లిప్పింగ్​ను ట్వీట్​కు జత చేశారు.

​"మహమ్మారి అలుముకున్నవేళ, ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వం సంక్షోభంలోనూ లాభాలు గడించింది"

- రాహుల్​ గాంధీ ట్వీట్

అయితే రైల్వే వర్గాల లెక్కలు మరోలా ఉన్నాయి. శ్రామిక్​ రైళ్లను నడపడానికి రూ.2,142 కోట్లను ఖర్చు చేయగా.. ఆ సర్వీసుల వల్ల కేవలం రూ.428 కోట్ల లాభం వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అజయ్​ బోస్​ అనే సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బహిర్గతమైంది. జూన్​ 29 నాటికి ఈ లాభం వచ్చిందని.. మొత్తం 4,615 రైళ్లు​ నడిపినట్లు ఆ సమాచారంలో పేర్కొన్నారు. జులైలో అదనంగా 13 రైళ్లు నడపడం ద్వారా రూ.కోటి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.