ఆంగ్లేయులకు దిమ్మదిరిగే షాక్​ ఇచ్చిన స్వామి వివేకానంద!

author img

By

Published : May 9, 2022, 8:09 AM IST

azadi ka amrith mahotsav

Swami Vivekananda: రాజకీయ నాయకులు, ఉద్యమకారులనే కాదు.. సామాన్య ప్రజలను కూడా వేధించిన ఆంగ్లేయ సర్కారు.. సాధువులనూ వదల్లేదు. అప్పట్లో కాషాయ దుస్తుల్లో సాధుసంతులు దేశమంతా కనిపించేవారు. తమ సంస్కృతికి భిన్నమైన వీరందరినీ చూసి ఆశ్చర్యపోవటమేగాకుండా.. అనుమానపడేది ఆంగ్లేయ సర్కారు. ఆ అనుభవం కాషాయధారి స్వామి వివేకానందకు కూడా ఎదురైంది!

Azadi Ka Amrith Mahotsav Swami Vivekananda: సాధువులందరినీ దొంగలుగానో, ప్రభుత్వంపై కుట్ర చేసేవారిగానో ఆంగ్లేయులు పరిగణించేవారు. వారిని అకారణంగా అదుపులోకి తీసుకొనేవారు. బిహార్‌ రాష్ట్రంలో ఓసారి మామిడి పండ్లకు బురదతో కూడిన బొట్లు పెట్టారు. ప్రతి తోటలోనూ కొన్నింటికి బొట్లున్నాయి. మరికొన్నింటికి లేవు. ఇది ఆంగ్లేయ పోలీసుల్లో అనుమానం రేకెత్తించింది. అంతకుముందు.. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఉత్తరభారతంలో అనూహ్యంగా చపాతీల రవాణా సాగినట్లే.. మామిడి బొట్లలో ఏదైనా రహస్యం దాగుందా? ప్రభుత్వంపై కుట్రకు ఇవేమైనా సంకేతాలా అనే కోణంలో పరిశోధించటం ఆరంభించారు. ఇదంతా సాధువుల పనే అనుకొని అనుమానంతో చాలామందిని అరెస్టు చేశారు. చివరకు.. నాణ్యమైన మామిడి, మామూలు పంటను గుర్తించటానికి ఇలా బొట్లు పెడుతున్నారని తెలిసి నాలుక కరచుకున్నారు. ఈ క్రమంలోనే ఓరోజు నడుచుకుంటూ వెళుతున్న వివేకానందుడిని బ్రిటిష్‌ సర్కారు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అడ్డుకున్నాడు. ఎవరు, ఎటు వెళుతున్నావంటూ ఆరా తీశాడు.

'నేనో సాధువును..' అంటూ స్వామి బదులిస్తుండగానే.. "సాధువులంతా బద్మాష్‌లు. నాతో రా. జైల్లో వేస్తా" అంటూ అకారణంగా కోపం ప్రదర్శించాడా ఇన్‌స్పెక్టర్‌. 'జైల్లో ఎన్నిరోజులు వేస్తారు?' అని అడిగారు వివేకానందుడు. 'బహుశా పదిహేను, లేదా నెలరోజులు' అన్నాడా పోలీసు. అప్పుడు స్వామి అతని చెవి దగ్గర గుసగుసలాడినట్లుగా.. 'అయ్యో నెలరోజులేనా? ఆరునెలలు లేదంటే కనీసం మూణ్నాలుగు నెలలైనా వేయించలేవా?' అని అడిగారు స్వామి. ఆశ్చర్యపోయిన ఆ పోలీసు అధికారి అనుమానంతో 'ఎందుకలా?' అని అడిగాడు. "జైల్లో జీవితం బయటికంటే హాయిగా ఉంటుంది. అక్కడ ఠంచనుగా టైముకు రెండు పూటలా భోజనం పెడతారు. కాబట్టి కొన్ని నెలలపాటు జైల్లో ఉండేలా చేశావంటే నీకు పుణ్యం వస్తుంది" అంటూ బదులిచ్చారు స్వామి. దీంతో ఎర్రబారిన ముఖంతో.. ఏమీ చేయలేక వివేకానందుడిని వదిలేసి తనదారిన తాను వెళ్లిపోయాడా బ్రిటిష్‌ పోలీసు.

మరోమారు కలకత్తాలోనే చేదు అనుభవం ఎదురైంది. కలకత్తా శివార్లలో తన శిష్యులతో పాటు ఉండేవారు వివేకానందుడు. నేర విచారణ విభాగంలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆంగ్లేయ పోలీసు అధికారి ఒకరోజు స్వామిని కలిశాడు. వివేకానందుడిని నవ్వుతూ పలకరించిన ఆయన సాయంత్రం ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. సరేనంటూ సాయంత్రానికి ఆయన ఇంటికి వెళ్లారు స్వామి. అప్పటికల్లా కొంతమంది సందర్శకులున్నారు. చాలాసేపటికి వారు వెళ్లిపోయారు. అయినా భోజనం పెట్టే సూచనలేమీ కనిపించటం లేదు. ఉన్నట్టుండి ఆ అధికారి.. సంభాషణ మళ్లించాడు.

"చూడూ.. ఇప్పటికైనా నాకు నిజం చెప్పు. కథలు కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను వెర్రివాణ్ణి చేయలేవనే సంగతి నీకు బాగా తెలుసు. మీ సంగతి నాకు తెలుసు. నీవు, నీ గ్యాంగ్‌ అంతా పైకి మతపరమైన బృందంలా కనిపిస్తారు. కానీ లోలోపల మీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని నా వద్ద బలమైన సమాచారం ఉంది. నిజం చెప్పు" అంటూ నిలదీశాడు. ఆశ్చర్యపోయిన వివేకానందుడు "మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. కుట్రలేంటి? వాటితో మాకు సంబంధమేంటి?" అంటూ ఎదురు ప్రశ్నించారు. "అదే నేనూ అడుగుతోంది. ఏదో భారీ కుట్రే చేస్తున్నారు మీరంతా. దానికి నువ్వే రింగ్‌లీడర్‌. ఇప్పటికైనా నిజం చెప్పు. నిన్ను అప్రూవర్‌గా అంగీకరించేలా నేను చూస్తా!" అంటూ పోలీసు అధికారి తెలివి ప్రదర్శించాడు.

"మీకంతా తెలిసినప్పుడు.. ఇదంతా ఎందుకు? నేరుగా నన్ను అరెస్టు చేసి మా ఇంటిని గాలించొచ్చుగదా?" అని ప్రశ్నిస్తూనే లేచి నిల్చొని తలుపు గడియవేశారు వివేకానంద. పీలగా బక్కపల్చగా ఉన్న ఆ పోలీసు అధికారి కంటే వివేకానందుడే దృఢంగా ఉన్నారు. "భోజనమనే నెపంతో నన్ను పిలిచి.. నాపై, నా సహచరులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అది మీ వృత్తి కావొచ్చు. కానీ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటం నా లక్షణం కాదు. నిజంగా నేను నేరస్థుడినో, లేక కుట్రదారుడినో అయితే.. ఈ క్షణమే నీ పీక పిసికేసేవాడిని. కానీ నిన్ను ప్రశాంతంగా వదిలి వెళుతున్నా" అంటూ తలుపు తెరచుకొని వెళ్లిపోయారు స్వామి వివేకానంద. కళ్లప్పగించుకొని ఆశ్చర్యపోయి చూస్తూండిపోయిన ఆ అధికారి మళ్లీ ఎన్నడూ స్వామి జోలికిగాని, ఆయన సహచరుల జోలికిగాని వెళ్లే సాహసం చేయలేదు.

ఇదీ చదవండి: మాతృభూమి కోసం కన్నబిడ్డలను త్యాగం చేసిన వీరమాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.