Azadi ka amrit mahotsav: మన చదువుల్ని కాపీ కొట్టి... మనను ఏమార్చి

author img

By

Published : Jan 11, 2022, 6:47 AM IST

azadi ka amrit mahotsav

Azadi ka amrit mahotsav: అనాగరికులమని, చదువులు తెలియనివాళ్లమని మనల్ని గేలిచేసిన ఆంగ్లేయులు... మన విద్యా విధానాన్ని కాపీ కొట్టారంటే ఈతరంలో చాలామంది నమ్మరు! కానీ అది నిజం! మన సొమ్మును, కోహినూర్‌లాంటి వజ్రాలను కొల్లగొట్టడమేకాదు.. మన విద్యావిధానాన్నీ కాపీకొట్టారు ఆంగ్లేయులు! భారతీయ పురాతన సంప్రదాయ విద్యావిధానం పుణ్యమా అని బ్రిటన్‌లో చదువులు చకచకా పరుగందుకుంటే... మెకాలే తోక పట్టుకుని ఈదటం మొదలెట్టిన మనం తిరోగమనంలోకి పయనించాం.

Azadi ka amrit mahotsav: షేక్‌స్పియర్‌, మిల్టన్‌, న్యూటన్‌లు వచ్చినా... ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాలున్నా...బ్రిటన్‌ మొత్తంలో 500 దాకా గ్రామర్‌ బడులున్నా... ఇవన్నీ... సమాజంలోని ఉన్నత వర్గాల వారికే పరిమితమయ్యేవి. భూస్వాములు, సంపన్నుల పిల్లలు మాత్రమే బడుల్లో చదవటానికి అర్హులు. మిగిలినవారు తమ తల్లిదండ్రులు చేసే వృత్తుల్లో, పనుల్లో చేరాల్సి ఉండేది. ఇలా సామాన్యులకు విద్య అందుబాటులో ఉండేది కాదు. ప్రొటెస్టెంట్‌ విప్లవం తర్వాత... పరిస్థితి మారటం మొదలెట్టింది. సామాన్య ప్రజల కోసం దాతృత్వ పాఠశాలలు ఆరంభమయ్యాయి. వీటిలోనూ బైబిల్‌ చదవటంపైనా, ఉన్నతవర్గాల వారిని పొగుడుతూ... వారికి అణిగిమణిగి ఉండటం ఎలా అనేదానిపై ఎక్కువ దృష్టిసారించేవారు. ఆ తర్వాత సండే స్కూల్‌ ఉద్యమం సాగింది. అందులోనూ బైబిల్‌ చదువుకే ప్రాధాన్యం.

భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన మొదలయ్యాక 18వ శతాబ్దం ఆరంభం నుంచి బ్రిటన్‌ విద్యావిధానంలోనూ మార్పులొచ్చాయి. విద్య అందరికీ అందుబాటులోకి రావటం మొదలైంది. 1787లో భారత్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేయటానికి వచ్చిన రెవరెండ్‌ బెల్‌... ఓ రోజు మద్రాసులో వీధి బడులను, అందులో పెద్ద పిల్లల నుంచి చిన్నపిల్లలు నేర్చుకునే తీరు చూసి ఆశ్చర్యపోయాడు. ఇసుకలో, బూడిదలో పిల్లలు అక్షరాలు దిద్దేతీరు... తరగతి పెద్ద (మానిటర్‌) ఇతరులకు బోధించే పద్ధతి ఆయన్ను ఆకట్టుకుంది. దాదాపు పదేళ్లు ఇక్కడ పనిచేసి ఇంగ్లాండ్‌ వెళ్లిన బెల్‌... అక్కడ ఈ ‘మద్రాసు విధానం’ (మానిటర్‌ పద్ధతి, పరస్పర బోధన విధానం) ప్రవేశపెట్టాడు. దీనిపై 1797లో ఓ పుస్తకం కూడా రాశాడు. బ్రిటన్‌లోని అన్ని బడుల్లోనూ దీన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చాడు. 1811లో ఇంగ్లాండ్‌ నేషనల్‌ సొసైటీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ఈ మద్రాసు పద్ధతిని అమలు చేసింది. దీంతో... 1821కల్లా 3లక్షల మంది పిల్లలు ఇంగ్లాండ్‌లో చదువుల్లో పడ్డారు. బెల్‌ చనిపోయేనాటికి బ్రిటన్‌లో దాదాపు 10వేల పాఠశాలలకుపైగా ఈ మద్రాసు విధానం పాటిస్తున్నాయి. 1833లో స్కాట్లాండ్‌లో ఆయన సూచనల మేరకు ఏకంగా ‘మద్రాసు కాలేజీ’ ఏర్పాటైంది. బెల్‌ సమాధిపై సైతం... మద్రాసు పద్ధతిని ప్రస్తావించటం గమనార్హం!

బెల్‌తో పాటు జోసెఫ్‌ లాంకస్టర్‌ అనే విద్యావేత్త కూడా దాదాపు ఇదే పద్ధతిలో బోధనను సిఫార్సు చేయటంతో... పాఠశాలలు, చదువులు బ్రిటన్‌లో వేగం పుంజుకున్నాయి. ఈ పద్ధతిపై లాంకస్టర్‌, బెల్‌లు మేధో హక్కుల కోసం పోటీ పడ్డారు. కానీ ఆ విధానంపై వీరిద్దరికీ హక్కులేదని... ఇది భారత్‌ నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్నదని బ్రిటిష్‌ విద్యావేత్త, ప్రస్తుతం బకింగ్‌హమ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేస్తున్న జేమ్స్‌ టూలే అభిప్రాయపడ్డారు. ‘‘పేద విద్యార్థుల కోసం భారత్‌లో నడుస్తున్న ప్రైవేటు విద్యావిధానం విక్టోరియన్‌ ఇంగ్లాండ్‌లో చదువుల్ని పూర్తిగా మార్చివేసింది’’ అంటారు టూలే! 19వ శతాబ్దంలో భారత్‌లోని వీధి బడుల్లో అనుసరించే విద్యావిధానం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా నాణ్యమైంది కూడా. వాటినే తొలుత బ్రిటన్‌లో ఆ తర్వాత యూరప్‌... ప్రపంచంలోని అనేక దేశాల్లో అనుసరించి సామాన్యులకు విద్యనందించారు. తమ విద్యాప్రమాణాలు పెంచుకున్నారు- అంటారు టూలే!

1850కల్లా... ఇంగ్లాండ్‌లో, ఐరోపాలో చదువులు పరుగులెత్తుతుంటే... భారత్‌లో తిరోగమనం మొదలైంది. థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే... 1854లో తన తొలి బడిని ఆరంభించారు. ఆంగ్లానికి ప్రాధాన్యమిస్తూ... బ్రిటిష్‌ ప్రభుత్వానికి కావల్సిన గుమాస్తాలను తయారు చేసే పద్ధతి మొదలైంది. అన్నింటికీ మించి... చదువు ఖరీదైనదై సరికొత్త అంతరాలను సంతరించుకుంది.

ఇదీ చదవండి: Azadi ka amrit mahotsav: చంపినా చావని ధైర్యం.. తురుంఖాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.