ఐదు బాక్టీరియాల వల్ల 6.8లక్షల మంది బలి.. గుండె జబ్బు మరణాల కన్నా ఇవే అధికం

author img

By

Published : Nov 23, 2022, 6:30 AM IST

bacteria deaths in india 2019

2019లో ఐదు రకాల బాక్టీరియాల వల్ల భారత్​లో 6.8 లక్షల మంది మరణించారని 'ద లాన్సెట్‌ జర్నల్‌' వెల్లడించింది. ఈ.కోలి అనే బాక్టీరియా వల్లే 1.57 లక్షల మంది ప్రాణాలు పోయాయని పేర్కొంది. గుండె జబ్బుల తర్వాత బ్యాక్టీరియా వల్లే ప్రపంచంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది.

మన దేశంలో ఈ.కోలి, ఎస్‌.న్యుమోనియా, కె.న్యుమోనియా, ఎస్‌.ఆరియస్‌, ఎ.బౌమానీ అనే ఐదు రకాల బ్యాక్టీరియాల వల్ల 2019లో 6.8 లక్షల మంది మరణించారు. 'ద లాన్సెట్‌ జర్నల్‌' తన తాజా కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సంవత్సరంలో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే మరణాలకు రెండో అత్యధిక కారణమని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటివల్లే సంభవించిందని అధ్యయనంలో వెల్లడైంది.

2019లో 33 రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మొదటి అయిదింటివల్లే అందులో సగం మంది మృతి చెందారని పరిశోధకులు తేల్చారు. ప్రాంతాలు, వయసులను బట్టి బ్యాక్టీరియా ప్రభావం మారుతోంది. భారతదేశంలో పైన పేర్కొన్న అయిదు రకాల బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా ఉండి, ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 6.8 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వాటన్నింటిలో ఈ.కోలి వల్లే 1.57 లక్షల మంది ప్రాణాలు పోయాయి. గుండె జబ్బుల తర్వాత బ్యాక్టీరియా వల్లే ప్రపంచంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాక్టీరియాల వల్ల ఎదురవుతున్న ముప్పు తీరు తొలిసారిగా పూర్తిస్థాయిలో తెలిసిందని పరిశోధనకు నేతృత్వం వహించిన వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టొఫర్‌ ముర్రే తెలిపారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కంటే ఈ.కోలి, ఎస్‌.ఆరియస్‌ బ్యాక్టీరియా వల్లే 2019లో ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు. 24 దేశాల్లో అన్ని వయసుల వారినీ పరిశీలించి ఈ లెక్కలు తేల్చారు. ఆ సంవత్సరంలో ఇన్ఫెక్షన్ల వల్ల మొత్తం 1.37 కోట్ల మంది మరణించగా, అందులో 77 లక్షల మంది 33 రకాల వ్యాధికారక బ్యాక్టీరియా వల్లే మృతిచెందారు. ఎస్‌.ఆరియస్‌ వల్ల ప్రపంచంలో 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 77 శాతం మరణాలకు దిగువ శ్వాసకోశ, రక్త, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లే కారణం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.