'జైలులో మంత్రికి మసాజ్'పై భాజపా ఫైర్.. ఫిజియోథెరపీలో భాగమేనన్న ఆప్

author img

By

Published : Nov 19, 2022, 2:19 PM IST

aap minister satyendar jain massage video

దిల్లీ తిహాడ్​ జైలులో ఆప్​ మంత్రి సత్యేందర్​ జైన్​కు సకల సౌకర్యాలు అందుతుండటంపై భాజపా పార్టీ ఘాటు విమర్శలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ విమర్శలను ఆప్ కొట్టిపారేసింది. ఫిజియోథెరపీలో భాగంగానే సత్యేందర్ జైన్​కు మసాజ్ చేశారని వివరణ ఇచ్చింది.

దిల్లీ తిహాడ్​ జైలులో ఆప్​ మంత్రి సత్యేందర్​ జైన్​కు మసాజ్​ చేస్తున్నట్లు ఉన్న వీడియోపై భాజపా పార్టీ ఘాటు విమర్శలు చేసింది. ఆ​ వీడియోపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై తీవ్రంగా మండిపడ్డ భాజపా పార్టీ ప్రతినిధి గౌరవ్​ భాటియా.. ఆమ్​ ఆద్మీ పార్టీ కాస్త 'స్పా అండ్​ మసాజ్​ పార్టీ'గా మారిందని ధ్వజమెత్తారు. జైలులో ఆయన ప్రవర్తన గురించి ఆప్​ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు.

"కేజ్రీవాల్​ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సత్యేంద్ర జైన్.. జైలులో మసాజ్​లు చేయించుకుంటూ స్నేహితులను కలుస్తున్నారు. ఇలాంటి వీవీఐపీ సంస్కృతి మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆయన జైలుకు వెళ్లి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఎందుకు జైన్​ను మంత్రి పదవి నుంచి తొలగించలేదు" అని భాటియా కేజ్రివాల్​ను ఉద్దేశించి ప్రశ్నించారు.

కాగా, భాజపా విమర్శలను ఆమ్‌ ఆద్మీ తిప్పికొట్టింది. ఇదంతా కాషాయ పార్టీ ఎత్తుగడ అని కొట్టిపారేసింది. జైలులో సత్యేందర్‌ గాయపడ్డారని, ఆయనకు చికిత్స అందిస్తున్నారని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా తెలిపారు. జైలులో పడిపోవడం వల్ల జైన్ వెన్నెముకకు గాయమైందని... దానికి ఫిజియోథెరపీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆయన వెన్నెముకకు రెండు శస్త్రచికిత్సలు అయ్యాయని.. వైద్యులు ఫిజియోథెరపీ చేయాలని సూచించినట్లు తెలిపారు. తన సహచరుడిపై తప్పుడు కేసు బనాయించి, ఆయన అనారోగ్యాన్ని భాజపా ఎగతాళి చేస్తోందని మండిపడ్డారు. దిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కమలం పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

అసలేమైందంటే?
సత్యేందర్‌కు తిహాడ్‌ జైలులో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపే జైలు సీసీటీవీ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో సత్యేందర్‌ జైన్‌కు మసాజ్‌ సహా వివిధ సౌకర్యాలు కల్పిన్నట్లు కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నట్లు వీడియోలు బహిర్గతమయ్యాయి.

సెప్టెంబరు 13, 14, 21వ తేదీల్లో సత్యేందర్‌కు బాడీ మసాజ్‌లు, కాళ్లకు మర్దనా, తలకు మర్దనా చేసినట్లు వీడియోల్లో స్పష్టమవుతోంది. సత్యేందర్‌ ఉంటున్న జైలు గదిలో బిస్లరీ వాటర్‌ బాటిళ్లు, టీవీ వంటి వీఐపీ సదుపాయాలు కల్పించినట్లు సీసీటీవీ వీడియోల్లో తెలుస్తోంది. నలుగురైదుగురు వ్యక్తులు కూడా జైలు గదిలో సత్యేందర్‌ జైన్‌తో మాట్లాడుతున్నట్లు వీడియోల్లో రికార్డయింది. మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్‌ జైన్‌.. ఈ ఏడాది మే 30న అరెస్టయ్యారు. 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. సత్యేందర్‌కు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు రాగా... దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు ఈడీ అందించింది. ఇవే ఆరోపణలపై తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఇటీవలే సస్పెన్షన్‌కు గురయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.