ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే.. 500 మందిని పట్టించిన నితిన్!

author img

By

Published : Nov 20, 2022, 4:14 PM IST

nitin yadav sketch artist

నేరస్థులను పట్టించడంలో పోలీసులకు వెన్నెముక నిలుస్తున్నారు ఓ వ్యక్తి. డ్రాయింగ్​పై ఉన్న ఇష్టంతో.. నేరస్థులకు కళ్లెం వేస్తున్నారు! అనేక కీలక కేసుల్లో ఆయన గీసిన చిత్రాలతోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అసలెవరాయన? ఆయన కథేంటి?

ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే

ఆయన 'స్కెచ్' వేశారంటే ఎలాంటి నేరస్థులైనా పోలీసుల వలలో చిక్కాల్సిందే.. నిందితుల ఆనవాళ్లు చెబితే చాలు.. వారి ముఖాలను అచ్చు గుద్దినట్లు దించేస్తారాయన.. ఇప్పటివరకు 500 మంది నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేశారు... ఆయనే క్యారికేచర్ ఆర్టిస్ట్ నితిన్ యాదవ్..

nitin yadav sketch artist
నితిన్ యాదవ్​

నేరస్థులను పట్టుకోవాలంటే పోలీసులు ముందుగా సంప్రదించేది నితిన్ యాదవ్​నే. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన నితిన్.. ఇప్పటివరకు 4 వేలకు పైగా స్కెచ్​లు గీశారు. నేరం చేసేటప్పుడు నిందితులు చిన్నసాక్ష్యం వదిలినా.. నితిన్ చేతిలోనుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పోలీసులు గుర్తుపట్టలేని కేసుల్లోనూ.. ఆయన పక్కాగా వారి ముఖాలను గీసేస్తారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పే కొన్ని వివరాలతోనే నిందితుల ఫొటోలను గీస్తారు.

కొన్నిసార్లు నేరస్థులు ఫోన్ చేసి నితిన్​ను బెదిరించినా ఆయన భయపడలేదు. పట్టుదలతో ఇప్పటికీ నేరస్థుల వేటలో పోలీసులకు సాయపడుతున్నారు. 2013లో ముంబయిలో సంచలనం రేపిన శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసును ఛేదించేందుకు పోలీసులు నితిన్​ను ఆశ్రయించారు. ఈ కేసులో నితిన్ గీసిన స్కెచ్​ల ద్వారానే నిందితులను పట్టుకున్నారు. 2012లో బాంద్రాలో విదేశీ యువతిపై జరిగిన అత్యాచార కేసును, 2010లో పుణెలోని జర్మన్ బేకరీ బాంబు దాడి కేసులోనూ నితిన్​ సాయం వల్లే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

"నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్​ అంటే ఇష్టం. 2008లో ఫొటోగ్రాఫర్​లను కోర్టులోకి ప్రవేశించేందుకు అనుమతించనప్పుడు ఓ స్థానిక పత్రిక కోసం ఉగ్రవాది అజ్మల్ కసబ్​.. ఫొటోను గీశాను. ఇలానే ఓ ప్రముఖ హోటల్​లో జరిగిన​ హత్య కేసును, 2013లో గ్యాంగ్​ రేప్​ కేసును నేను గీసిన ఫొటోల ద్వారానే పోలీసులు ఛేదించారు. ఇప్పటివరకు సుమారు 500 మంది నేరగాళ్లను పోలీసులు నా స్కెచ్​ల ద్వారా పట్టుకున్నారు."

--నితిన్ యాదవ్

చిన్నతనంలోనే తన తల్లి నుంచి స్కెచ్ వేయడం నేర్చుకున్నారు నితిన్​ యాదవ్. ఆయన తండ్రి నేత కార్మికుడు. మిల్లు కార్మికుల కోసం రాసే హోర్డింగ్​లను తన చేతిరాతతో, స్కెచ్​తో అందంగా తీర్చిదిద్దేవారు నితిన్​. నితిన్ యాదవ్ తండ్రి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన చిహ్నాలను, స్లోగన్​లను రాసేవారు. పాఠశాల దశలోనే నితిన్​ డ్రాయింగ్ ప్రతిభను చూసి ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. ఆయనను ప్రోత్సహించారు.

nitin yadav sketch artist
నితిన్ యాదవ్​ తీర్చిదిద్దిన కళాఖండాలు
nitin yadav sketch artist
నితిన్ యాదవ్​ తీర్చిదిద్దిన కళాఖండాలు

నితిన్​.. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్​లో చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అక్కడే ప్రొఫెసర్​గా పనిచేశారు. నేరస్థుల క్యారికేచర్​లే కాక ఇతర చిత్రాలను అద్భుతంగా గీసే ప్రతిభ ఆయన సొంతం. ఇప్పటివరకు నితిన్​ 164 అవార్డులను గెలుచుకున్నారు.

nitin yadav sketch artist
నితిన్ యాదవ్​ తీర్చిదిద్దిన కళాఖండాలు
nitin yadav sketch artist
నితిన్ యాదవ్​ తీర్చిదిద్దిన కళాఖండాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.