Young Man Died with Scrub Typhus in Dharmavaram: స్క్రబ్‌టైపస్ జ్వరం సోకి యువకుడు మృతి..కొత్తరకం జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
Young Man Died with Scrub Typhus in Dharmavaram : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన గవ్వల మధు(19) అనే యువకుడు స్క్రబ్ టైపస్ జ్వరంతో మృతి చెందారు. పెనుకొండ కియా అనుబంధ పరిశ్రమలో పని చేసే మధు 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ.. జ్వరం తగ్గకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ గవ్వల మధు మృతి చెందారు. కీటకం కుట్టడం వల్ల స్క్రబ్ టైపస్ జ్వరం సోకి మధు మృతి చెందాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోతుకుంట గ్రామానికి బెంగళూరు నుంచి యువకుడి మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోతుకుంట గ్రామానికి వైద్య బృందం చేరుకొని యువకుడి మృతికి సంబంధించి విచారణ చేపట్టారు. డాక్టర్ పుష్ప, డీఎంహెచ్ఓ డాక్టర్ సెల్వియా గ్రామాన్ని సందర్శించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి కొత్త రకం జ్వరంపై తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తామని వైద్యురాలు పుష్ప పేర్కొన్నారు.