అవమానం భరించలేక రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్న యువకుడు
Young Man Commits Suicide by Falling Under a Train : అవమానం భరించలేక తీవ్ర మనస్థాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించాడంటూ.. గతంలో యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ యువకుడు.. కర్నూలులో ఓ హోటల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.
ఆ యువకుడి వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.చింతకుంట గ్రామానికి చెందిన బాల నరసింహుడు. ఈ మధ్యనే స్వగ్రామానికి చేరుకున్న నరసింహుడుపై మైనర్ అమ్మాయి తరుపు బంధువులు దాడి చేశారు. ఇంతో తీవ్ర మనస్థాపానికి చెందిన అతను రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు.
నరసింహుడు ఆత్మహత్య చేసుకునే ముందు.. తన తప్పు లేకున్నా దాడి చేసిన బంధువులకు శిక్ష పడాలని, తమ్ముడు బాగా చదువుకోవాలని సూచిస్తూ సూసైడ్ నోట్లో తెలియజేశాడు. చేతికి అందిన కుమారుడిని విగతజీవిగా చూసి అతని తల్లి పుట్టెడు శోకంలో మునిగిపోయింది. అతని తల్లి నాగలక్ష్మి కుమారుడి ఆత్మహత్య కు కారణమైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.