YCP leaders attacked: వైసీపీ నేతల రౌడీయిజం.. టీడీపీ జెండాలు లాక్కొని రాళ్లతో దాడి
Published: May 15, 2023, 7:28 PM

YCP leaders attacked TDP leaders: తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తెన నేపథ్యంలో సంఘీభావం ప్రకటిస్తూ.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు వద్ద నిర్వహిస్తున్న పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలోని ములకలచెరువులోని తితిదే కళ్యాణ మండపం నుంచి సంఘీభావ యాత్ర నిర్వహించడానికి టీడీపీ నాయకులు సిద్దమయ్యారు. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకుని.. సంఘీభావ పాదయాత్ర జరపడానికి వీల్లేదంటూ టీడీపీ నేతల వద్ద నుంచి జెండాలు లాక్కోవడంతో ఈ ఘర్షణ జరిగింది.. ఈ క్రమంలో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి.
సంఘీభావ పాదయాత్రకు పోలీసులు అనుమతించినా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుపడటంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో ప్రతిగా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. సంఘటనా స్ధలంలో ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి సంఘీభావ పాదయాత్ర చేయకుండా నిలవరించారు. తంబళ్లపల్లె శాసనసభ్యుడు ద్వారకనాథ్ రెడ్డి దగ్గరుండి సంఘీభావ యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేత శంకర్ యాదవ్‌ను.. పోలీసులు అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు.