అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారనే నెపంతో జనసేన నేతలపై వైసీపీ నేతల మూకుమ్మడి దాడి!
YCP Leaders Attack on Janasena Leaders: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద జనసేన నాయకులపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. సంగం మండలం అనసూయ నగర్ మీదుగా గత రెండు రోజులుగా పెన్నా పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు భారీ వాహనాలతో ఇసుకను అక్రమంగా రవాణా చేయడం వలన రోడ్లు, ఇళ్లు దెబ్బతింటున్నాయంటూ.. నిన్న స్థానికులు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. లారీలను అడ్డుకున్న స్థానికులను వైసీపీ నాయకులు బెదిరించారు.
అయితే స్థానికులకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ (Nalisetty Sridhar) ఆధ్వర్యంలో ఈరోజు అక్రమ ఇసుక వాహనాలను అడ్డుకొని ఆందోళన చేశారు. ఆందోళన అనంతరం తిరిగి వస్తున్న జనసేన నాయకులపై ఒక్కసారిగా మూకుమ్మడిగా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో దువ్వూరు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాడి ఘటనపై జనసేన నాయకుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.