అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ వైసీపీ నేత - సిగ్గుచేటన్న జనసేన
YCP Leader Arrested for Selling Illegal Liquor : కృష్ణా జిల్లా, కోడూరు మండలం, విశ్వనాధపల్లి గ్రామంలో అక్రమంగా బెల్టు షాపు నిర్వహిస్తున్న వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని నాంచారమ్మ అమ్మవారి గుడికి సమీపంలో మద్యం గొలుసు దుకాణం నిర్వహిస్తున్న తోట భాగ్య లక్ష్మయ్యను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 32 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచామని అవనిగడ్డ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నూకరాజు తెలిపారు.
కాగా, ఇటీవల అవనిగడ్డలో వైసీపీ ఏర్పాటు చేసిన సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా నిందితుడు.. జనసేన పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఇతర సందర్భాల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ పై తోట భాగ్య లక్ష్మయ్య తీవ్రంగా ఆరోపణలు చేశారు. జనసేనానిపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతే అక్రమంగా బెల్టు షాపు నిర్వహిస్తూ పట్టుపడ్డం సిగ్గు చేటని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులే వైసీపీలో ఉంటారని ఎద్దేవా చేశారు.