Women Protest for Water on Road at Podili: పొదిలిని వేధిస్తున్న నీటి కష్టాలు..మరోసారి రోడ్డెక్కిన మహిళలు
Women Protest for Water on Road at Podili : ప్రకాశం జిల్లా పొదిలి ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సాగర్ నీళ్లు 10 రోజులకు ఒకసారి కూడా సరఫరా కావడం లేదు. తాగునీటి అవసరాలు తీర్చడంలో అధికారులు విఫలం అయ్యారంటూ ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలు నిరసన (Water Problem in Prakasam District) చేపట్టారు. కర్నూల్, ఒంగోలు ప్రధాన రహదారి మీద టైర్లు, బిందెలు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
సాగర్ నీళ్లు విడుదల చేసి నెలరోజులు అయ్యిందని, ట్యాంక్లు సంవత్సర కాలం నుంచి రావడం లేదని వారు ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలు రూపాయలు వెచ్చించి.. నీళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుక్కుంటున్నామని వారు పేర్కొన్నారు. మహిళలు నిరసనతో కర్నూలు రోడ్డులో వాహనాలు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్డబ్ల్యుఎస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు మహిళలకు నచ్చ చెప్పి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత నెల రోజుల వ్యవధిలో నీటి కోసం ప్రజలు మూడు సార్లు రోడ్డెక్కారు.