ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేసి - మూటకట్టి గోదావరిలో పడేసి
Published: Nov 19, 2023, 10:55 PM

Wife Killed her Husband in Anakapally District: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను.. భార్యే కడతేర్చింది. పక్కా పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని మూటకట్టి గోదావరి నదిలో పడేసింది. పోలీస్ మార్కు విచారణతో అసలు నిజం బయటకు రావడంతో.. కిలాడి మహిళను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పూలపర్తికి చెందిన తాడేల కొండలరావు ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 12న తన భర్త కనిపించటంలేదంటూ తాడేల ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కొండలరావు కుటుంబసభ్యులు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొండలరావు భార్య ఉమకు.. తూర్పుగోదావరి జిల్లా సురవరం గ్రామానికి చెందిన ప్రగడ చిరంజీవితో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. విషయం తెలిసిన కొండలరావు.. భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఉమ పన్నాగం పన్నింది. ప్రియుడు చిరంజీవి, మరో వ్యక్తి హరితో కలిసి హత్యకు పథకం రచించింది.
ఈ నెల 7వ తేదీన ఉమ, ఆమె ప్రియుడు కలిసి.. ఆసుపత్రికి వెళదామంటూ కొండలరావుకు మాయమాటలు చెప్పి బలవంతంగా అతడ్ని కారులో బయటకు తీసుకెళ్లారు. 8వ తేదీ తెల్లవారుజామున కొండలరావును.. చిరంజీవి, హరి కలిసి కారులోనే గొంతు నులిమి హత్య చేశారు. ఉమ సలహాతో మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద గోదావరి నదిలో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఉమ ఫిర్యాదు చేసింది. చివరికి ఆమె ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు.