సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా వృషభోత్సవాలు
Vrishabhotsavalu in Simhadri Appanna Temple : హిందూ సంప్రదాయంలో ఆవుకు పూజలు చేయడాన్ని చూసి ఉంటాం. అందులో భాగంగానే విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలోని గోశాలలోని వృషభానికి పూజలు చేశారు. ఏటా కార్తీక పాడ్యమి రోజున వృషభోత్సవం జరపడం అక్కడి ఆనవాయితీ. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ఆధ్యర్వంలో.. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
వృషభానికి ప్రత్యేక పూజలను సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు, దేవస్థానం ఈవో శ్రీనివాస్ మూర్తీ నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణునికి పూజలు చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం సహాయంతో.. వృషభోత్సవాలను జరుపుతున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాస్ మూర్తి తెలియజేశారు. ఆవుకు పూజలు చేయడంలో భాగంగానే.. కార్తీక మాసం ప్రారంభం రోజున వృషభానికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు ఆధారమైన వృషభానికి కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నాంది పలికినట్లు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నాయకుడు కుమార్ స్వామి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతిక భారతీ పేరు మీద వృషభోత్సవాలను నిర్వహించాలని చెప్పడం సంతోషకరమైన విషయమని తెలియజేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వృషభోత్సవాలను నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.