ఈస్ట్ కోస్ట్ మెరైన్ కంపెనీ మూసివేయాలంటూ గ్రామస్థుల ఆందోళన
Villagers Protest Against East Coast Marine Company: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం దిండి పంచాయతీ పరిధిలోని గ్రామస్థులు ఆందోళన చేశారు. ఏమినేని వారిపాలెంలో ఉన్న ఈస్ట్ కోస్ట్ మెరైన్ ప్రొడక్ట్స్ కంపెనీ మూసి వేయాలంటూ కంపెనీ ముందు నిరసన చేశారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వలన అనారోగ్య బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య తల కాయలను కుళ్లబెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్ధాలు రేవులో కలుపుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారని రొయ్యల చెరువుల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరించలేని దుర్వాసన వల్ల చిన్నపిల్లలకు, వృద్ధులకు వాంతులు, కీళ్లనొప్పులు, కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కంపెనీ కట్టే ముందు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెప్పారని... కానీ ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా.. కంపెనీ నిర్వహణ ఉందని మండిపడుతున్నారు. పోలీసులు వచ్చి గ్రామస్థుల సమస్యను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.