స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాలది కీలక పాత్ర - ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి : వెంకయ్యనాయుడు
Venkaiah Naidu In 56th National Library Festival In Vijayawada: గ్రంథాలయాలు, దేవాలయాలు ఒక్కటేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలోనూ ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. పుస్తక పఠనం అనేది సమాజంలో మనిషిని ఉత్తమంగా నిలుపుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి మువ్వారపు వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాలు ఎంతో కీలకపాత్ర పోషించాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కృషి చేశారన్నారు. విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి వెంకయ్యనాయుడు 5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. పుస్తకాలు చదివితే భాషపైన, విషయంపైన పూర్తి అవగాహన, పట్టు వస్తుందన్నారు. మంచి పుస్తకం చదివితే మంచి ఆలోచనలు వస్తాయని వెంకయ్య నాయుడు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహుముఖ కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు వెంకయ్యనాయుుడు చేతులగా బహుమతులు ప్రదానం చేశారు.