Two Year Old Boy Dies After Tractor Tire Falls: టైరు మీదపడి రెండేళ్ల బాలుడు మృతి.. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదం
Two Year Old Boy Dies After Tractor Tire Falls: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై టైరు పడి మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. అప్పటి వరకూ సరదాగా ఆడుకున్న బాలుడిని విగతజీవిగా చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఐడీఏలో ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
సేఫ్ ఇండస్ట్రీ కంపెనీలో టాక్టర్కు సంబంధించి విడిభాగాలను తయారు చేస్తుంటారు. అక్కడ వాచ్మెన్గా పని చేస్తున్న పొట్ట జోజికి ఇద్దరు పిల్లలు. అందులో మొదటి సంతానం కుమార్తె జైశ్రీ రాణికి నాలుగు సంవత్సరాలు కాగా.. రెండో సంతానం కుమారుడు ఇస్సాక్కి రెండు సంవత్సరాలు. బాలుడు ఇస్సాక్.. ఆదివారం రాత్రి కంపెనీలో నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ టైర్లతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా టైరు మీద పడిపోవటంతో.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బాలుడి తండ్రి ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడి మృతిదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.