జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడనేది కలే: తులసి రెడ్డి
Tulasi Reddy Comments on YSRCP Government: ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తాడనే మాట కలే అని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దృష్టిలో రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ, నెంబర్ టూ ద్రోహి వైసీపీ అని తులసి రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
డిసెంబర్ 3 తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలుగొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కనీసం మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తులసి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకోవడం లేదనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. జగన్ సర్కారుపై రైతులు రగిలి పోతున్నారని,ఉద్యోగులు ఉడికిపోతున్నారు, మందు బాబులు మండిపోతున్నారంటూ.. తులసి రెడ్డి విమర్శించారు. ప్రజలకు జగన్ సర్కారు న్యాయం చేసి ఉంటే పులివెందుల నియోజకవర్గంలో 3000 మంది పోలీసులు, బారికేడ్లు, పరదాల చాటున ఎందుకు పర్యటించాల్సి వచ్చిందని తులసి రెడ్డి ప్రశ్నించారు.