పార్టీ మీటింగ్కు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా - ఇద్దరు మృతి
tractor overturns 2 dead 27 injured : రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమానికి ప్రజలను తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరు ఘటన ప్రదేశంలో మరణించారు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా మందస మండలం గౌడుగురంటి గ్రామం వద్ద చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదంలో 27 మంది గాయాల పాలయ్యారు. బాధితులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసు గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో సుమారు 40 మంది ప్రయాణిస్తునట్లు బాధితులు తెలిపారు.
ఓ రాజకీయ పార్టీ సమావేశం కోసం.. ఒడిశాలోని భరత పంచాయతీ నుంచి ఆంధ్రా మీదుగా... ఒడిశాలోని పాత్రపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. బాధితులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు వైద్యులు తెలిపారు.