అరకులో పర్యాటక శాఖ సిబ్బంది నిరసన - నిరాశతో వెనుదిరిగిన టూరిస్టులు
Tourism Department Workers Protest: అల్లూరు జిల్లా అరకులో పర్యాటక శాఖ కార్మికులు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ.. ఐదు యూనిట్లలో నిరసన చేపట్టారు. దీంతో అరకులోని బొర్రా గుహలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో అరకు అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశకు గురయ్యారు. పర్యటక శాఖలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు.
రెగ్యులర్ ఉద్యోగుల మాదరిగా తమకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆపేదే లేదని కార్మికులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలతో అక్కడి ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కాంట్రాక్ట్ ఉద్యోగులు, పర్యాటక శాఖలోని రోజువారి కూలీల సంఘాలు పాల్గొన్నాయి.