జడ్పీటీసీ సభ్యురాలికి బెదిరింపుల కేసులో వైసీపీ నేత అరెస్టు - పోలీసులను అడ్డుకుని విడిపించుకుపోయిన అనుచరులు
Threat to Avuku JPTC Member: నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మిని బెదిరించిన కేసులో.. అనంతపురం జడ్పీ ఉపాధ్యక్షుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు శ్రీలక్ష్మి ఆవుకు పోలీసులకు ఈ నెల 1న ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ సిమ్ కార్డు ఎవరిదన్న అంశంపై కూపీ లాగారు. దీని వెనుక అనంతపురం జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి ఉన్నట్లు తెలుసుకున్నారు.
అడ్డుకున్న అనుచరులు.. సుధాకర్‌రెడ్డిని శనివారం సాయంత్రం ధర్మవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తరలిస్తుండగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. వాగ్వాదం నడుమ సుధాకర్‌రెడ్డిని వాళ్లు విడిపించుకుని తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఆవుకు పోలీసులు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులుతో చర్చించగా.. తమకు తెలియకుండా తమ ప్రాంతానికి వచ్చి ఎలా అరెస్టు చేస్తారని డీఎస్పీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సుధాకర్‌రెడ్డి సన్నిహితుడు. విచారణకు మూడు రోజుల్లోగా ఆయనే వస్తారని ధర్మవరం పోలీసులు అవుకు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.