Tension in Oppicharla Due to Demolition of Anganwadi: అంగన్వాడీ కేంద్రం కూల్చివేత.. గ్రామస్థుల ఆగ్రహం
Tension in Oppicharla Due to Demolition of Anganwadi: పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూల్చివేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండే పోలింగ్ కేంద్రం మార్చే దురుద్దేశంతో అంగన్వాడీ కేంద్రాన్ని జేసీబీ (JCB)తో కూల్చివేశారన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ సుమారు 40ఏళ్లుగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తొలగించారని విమర్శించారు. అంగన్వాడీ(Anganwadi) శిథిలావస్థకు చేరిందంటూ తొలగించడం సమంజసం కాదని స్థానికులు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని కూల్చి గ్రామంలోని ప్రజలు వ్యతిరేకించడంతో... పోలీసులను పహారా పెట్టిమరీ అంగన్వాడీ కేంద్రాన్ని తొలగించారని ఆరోపించారు.
కూల్చివేతలను అడ్డుకున్నేందుకు ప్రయత్నించిన పలువురు మహిళలపై పోలీసులు దుర్భాషలాడారని ఆరోపించారు. తాము వృద్ధులమని.. ఎక్కడో పొలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేమని ప్రాధేయపడ్డా వినిపించుకోలేదని ఆరోపించారు. అడ్డుకున్న మమ్మల్ని అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపించారు. 80 సంవత్సరాలు పైబడిన తాము ఎక్కడికో వెళ్లి ఓటు ఎలా వేయగలమా అని ప్రశ్నించారు.