TDP MPs Protest at Parliament చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన
Published: Sep 18, 2023, 12:53 PM

TDP MPs and Ex MPs Protest at Parliament: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ కక్షసాధింపులు పరాకాష్టకు చేరాయన్న ఎంపీలు.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్.. వియ్ వాంట్ జస్టిస్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. లోకేశ్‌తో పాటు ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, అదే విధంగా మాజీ ఎంపీలు అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు,కంభంపాటి రామ్మోహన్‌రావు, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. పార్లమెంట్‌లోనూ తమ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.