34 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును గాలికొదిలేశారు - కరెంటు బిల్లులు కట్టలేని ప్రభుత్వంపై టీడీపీ నేతల ఆగ్రహం
TDP Leaders visited Vontimitta Lift Irrigation Project: ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకాన్ని అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్ల ఈ ఎత్తిపోతల పథకం మూలనపడిందని వారు విమర్శించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ నేతలు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఎత్తిపోతల పథకాన్ని గాలికొదిలేసిందని వారు మండిపడ్డారు. సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు ఎత్తిపోసే పథకాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరడంతో.. గత టీడీపీ ప్రభుత్వం 34 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. నీళ్లు పంపిణీ చేశామని వారు తెలిపారు.
టీడీపీ తీసుకున్న చర్యలతో చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు పొలాల్లో ఉన్నటువంటి బోర్లకు, గ్రామంలో ఉన్నటువంటి బోర్లకు నీరు అందటంతో ప్రజల సమస్యలు తీరాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కనీసం మోటార్లకు కానీ, కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో గత కొన్నేళ్లుగా ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు పంపిణీ ఆగిపోయింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వచ్చాయని, తక్షణమే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు.