సుదర్శన యాగం పరిసమాప్తం - చంద్రబాబుకు రక్ష కట్టి ఆశీర్వచనాలు అందిస్తామన్న పండితులు
TDP Leader Yarlagadda Venkata Rao Sudarshana Yagam: గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం తలపెట్టిన యాగం ఈ రోజు పూర్ణాహుతితో ముగిసింది. రాష్ట్రంలో జగనాసురుడి పాలన అంతమొంది.. చంద్రబాబు నేతృత్వంలో మళ్లీ ఏపీ అభివృద్ధి దిశగా సాగాలని యాగం తలపెట్టినట్టు తెలుగుదేశం నేతలు తెలిపారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని విజయవాడ నగర శివారులోని యార్లగడ్డ గ్రాండియర్‌లో నిర్వహిస్తోన్న యాగం ఇవాళ పూర్ణాహుతితో ముగిసింది.
గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకటరావు నేతృత్వంలో చండీ హోమం, సుదర్శన లక్ష్మీనరసింహ, రాజశ్యామలయాగాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. నేపాల్‌కు చెందిన రుత్వికులతోపాటు వేదపండితులు ఈ యాగాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొని.. వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. యాగం అనంతరం రక్షను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఆయనకు కట్టి.. ఆశీర్వచనాలు అందిస్తామని పండితులు తెలిపారు.