జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరును వాడుకుంటూ ఇప్పటికీ జగన్ రెడ్డి ఇసుక దోపిడీ: పట్టాభి
TDP Leader Pattabhi Ram Comments on YS Jagan: గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంపై కేసులు పెట్టిన సీఐడీ అధికారులు.. వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నా ఎందుకు కేసులు పెట్టడం లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు గతంలో ఇచ్చిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కాలపరిమితి పెంచినట్లు మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే, నిజంగా ప్రభుత్వం పొడిగిస్తే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను వెంకట్ రెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదని పట్టాభిరామ్ ప్రశ్నించారు. మే నుంచి అక్టోబర్ వరకు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఎలాంటి జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని ఆధారాలతో సహా చూపించారు. జేపీ వెంచర్స్ ఆరు నెలల క్రితమే.. రాష్ట్రం నుంచి పెట్టే బేడా సర్దుకొని పోయిందని పట్టాభి పేర్కొన్నారు. ఆ సంస్థ గత ఆరు నెలలుగా ఇసుక తవ్వకాలపై జీఎస్టీ కట్టడం లేదని తెలిపారు.
జగన్ రెడ్డి, తన అనుచరులూ.. ఇసుక దోపిడీ కోసం ఇప్పటికీ.. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరును వాడుకుంటూ, తప్పుడు వేబిల్లులు ఇస్తున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. జగన్ విచ్చలవిడిగా ఇసుకదోపిడీ కొనసాగిస్తున్నాడని రట్టాభి ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణలో A1 నిందితుడు సీఎం జగన్ మోహన్ రెడ్డే అని పట్టాభి రాం ఆరోపించారు. కేవలం ఇసుక దందా ద్వారా సంవత్సరం రూ.10వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలవడానికి ఈ డబ్బులను పంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇసుక, మద్యం... ద్వారా ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని పట్టాభి విమర్శించారు. ఇప్పటికీ జేపీ వెంచర్స్ పేరుతోనే వే బిల్స్ ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమలపై టీడీపీ ఎంపీలు సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖలు రాశారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవ్వరినీ వదలబోమని పట్టాభిరామ్ హెచ్చరించారు.