వైసీపీ అరాచక పాలన అంతమే లక్ష్యం : తెలుగుదేశం-జనసేన జేఏసీ నేతలు
TDP Janasena JAC Leaders Meeting in Vizianagaram: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తెలుగుదేశం-జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుగు సాగాలని ఇరుపార్టీల జేఏసీ మహిళా నేతలు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించాయి. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో రానుందని.. దానిని ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత జనసైనికులందరిపై ఉందని జేఏసీ నేతలు చెప్పారు. క్షేత్ర స్థాయిలో జనసేన.. టీడీపీ నాయకులతో కలసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని అన్నారు.
జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ప్రతి జన సైనికుడు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన-టీడీపీ జేఏసీ రాష్ట్ర సభ్యురాలు పాలవలస యశస్వి, జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ, జనసేన- టీడీపీ విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ లోకం మాధవి ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.