TDP Bandh Arrests: టీడీపీ బంద్.. స్వచ్ఛందంగా పాఠశాలలు, దుకాణాలు మూసివేత.. టీడీపీ నేతల అరెస్ట్
TDP Bandh Arrests: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పాఠశాలలు, వాణిజ్య దుకాణాలు మూతపడగా.. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు చర్చి సెంటర్ (Ongole Church Centre) నుంచి ప్రధాన వీధిలో ర్యాలీ నిర్వహించగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కనిపిస్తే అదుపులోకి... ఒంగోలు బస్టాండ్ లో తెలుగుదేశం కార్యకర్తలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను కనిపించిన చోట అదుపులో తీసుకుని వాహనాలు ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. గిద్దలూరు బస్టాండ్ లో తెలుగుదేశం నాయకులను అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. సంతనూతలపాడులో జాతీయ రహదారి ( National Highway ) 216 పై రాస్తారోకో చేపట్టిన టీడీపీ నాయకులను, దర్శిలో బంద్ పాటిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీసీ పల్లి మండలంలోని తలకొండపాడులో గ్రామంలోని రహదారిపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు.