వారిని సస్పెండ్ చేస్తే సరిపోదు డిస్మిస్ చేయాల్సిందే - టీడీపీ నేత అయ్యన్న ఆగ్రహం
TDP Ayyanna Patrudu on Attack on Army Jawan: ఇటీవల అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసులు ఓ ఆర్మీ జవాన్‌పై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వారిని తక్షణమే ఉద్యోగంలో నుంచి తొలగించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్‌కు పోలీసుల నుంచే రక్షణ కరువవడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై ఆర్మీ జవాన్ల సంఘం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా ఈ ఘటనను తీవ్ర స్థాయిలో పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని విడుదల నుంచి పూర్తిగా తొలగించాలని అయ్యన్న పాత్రుడు కోరారు. లేకుంటే వివిధ సంఘాల ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.