ఆర్టీసీ ఉద్యోగులపై వేధింపులు ఆపకపోతే ఆందోళన తప్పదు : దామోదర్ రావు
RTC Employees Union State President on RTC Management: వెహికల్ ఫెయిల్యూర్ అంటూ యాజమాన్యం ఆర్టీసీ మెకానిక్లు, సూపర్వైజర్లను బదిలీ చెయ్యడం, బస్సు ఆగిపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసు బోర్డులో పెట్టడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సుల కండిషన్ బాగాలేదని, కొత్త బస్సులు కొనే పరిస్థితి కుడా లేదని ఆయన నెల్లూరులో అన్నారు. యాజమాన్యం స్పేర్ సక్రమంగా అందించకున్నా మెకానిక్లు బస్సుల కండిషన్ మెరుగుపరిచేందుకు తీవ్రంగా కష్ట పడుతున్నారని చెప్పారు. అయినా మెకానిక్లు, సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవటం తగదన్నారు.
17 నెలలుగా కార్మికులకు అరియర్స్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సక్రమంగా స్పేర్స్ పార్ట్స్ అందివ్వకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని దామోదర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులపై వేధింపులను అరికట్టి, కార్మికుల సమస్యల పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.