ఇడుపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం
Python Stir in in YSR dist : వైఎస్సార్ జిల్లాల్లో కొండచిలువ కలకలం సృష్టించింది. వేెంపల్లె మండలం ఇడుపాయ ట్రిపుల్ ఐటీలోని బాయ్స్ హాస్టల్-2లో.. ఓ మంచం కింద దాక్కున్న కొండచిలువను చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టరు సంధ్యారాణి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా... వేంపల్లె అటవీ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అటవీ అధికారులు కొండచిలువను గోనె సంచిలో బంధించి.. సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండచిలువను అధికారులు బంధించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇడుపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీ శేషాచల అడవులకు సమీపంలో ఉండటం వల్ల.. తరచూ పాములు, కొండచిలువలు హాస్టల్ల్లోకి వస్తూ ఉంటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లోకి పాములు, కొండచిలువలు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి తెలియజెేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు.