Pawan Kalyan on Janasena Glass Symbol జనసేనకు ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ కేటాయింపు.. పవన్ కల్యాణ్ హర్షం
Pawan Kalyan on Janasena Glass Symbol: జనసేనకు ఎన్నికల గుర్తుగా.. మరోసారి గ్లాస్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, 15 పార్లమెంటు స్థానాలతో పాటు.. తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. దీంతో గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారని, గుర్తు జనసేనకు రాదని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో జనసేన రిజిస్టర్డ్ పార్టీ అయినందున వారు కోరినట్లు గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ గుర్తు మరోసారి కేటాయించటంపై సంతోషం వెలిబుచ్చారు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.