Pawan Kalyan Fires on YCP Govt: ప్రభుత్వ చర్యలు ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం: పవన్ కల్యాణ్
Pawan Kalyan Fires on YCP Govt: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మానాన్నల తరవాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ల దగ్గరేనన్నారు. ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా విజ్ఞానాన్ని పంచి... శిష్యుల విజయాలనే తమవిగా భావిస్తారని అభిప్రాయపడ్డారు. తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు... తమ శిష్యులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని కల్యాణ్ ఆకాంక్షించారు. అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల మన రాష్ట్రంలో పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు. ప్రభుత్వ చర్యలు ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించి వారిని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. నాడు-నేడు పనుల్లో అధికార పార్టీ నేతలు చేసే తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని పవన్ ఎద్దేవా చేశారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు రావటం లేదన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకునే ఈ సమయంలో కూడా రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించకపోవటాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గురు దేవుళ్లపై ఎలాంటి వైఖరి అవలంబిస్తోందో అర్థమవుతోందన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందన్నారు.