ఇల్లు లాక్కున్న కుమారుడు - మూడేళ్లుగా పోరాటం - ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద వృద్ధుడు ఆత్మహత్య
Old Man Commits Suicide at Atmakuru RDO office: కనిపెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కుమారులు.. వారి ఆస్తిని లాక్కొని, బయటికి గెంటేస్తున్న ఉదంతాలు నిత్యం ఏదో ఓ చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనంగా మారింది. తన ఆస్తిని లాక్కొని, బయటికి గెంటేశారంటూ మూడేళ్లుగా తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఫకీర్ సాహెబ్ అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
జరిగిన సంఘటన ఇది.. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఫకీర్ సాహెబ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయగిరిలో ఉండగా, చిన్న కొడుకు మర్రిపాడులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఉదయగిరిలో ఉన్న ఇల్లు తనకే చెందుతుందంటూ పెద్ద కొడుకు ఫకీర్ సాహెబ్ (తండ్రి)ని బయటకు పంపించేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మూడేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఇవాళ ఆర్డీవోను కలిసేందుకు వచ్చిన వృద్ధుడు.. ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో మనస్థాపం చెంది కార్యాలయం వద్దనే పురుగుల మందు తాగేశాడు. దీంతో స్థానికులు హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.