NTR Schemes: 'అన్నా' అనే పదానికి సార్థక నామధేయుడు.. ఆ జోడెడ్ల బండికి బ్రాండ్ అంబాసిడర్
Published: May 28, 2023, 11:16 AM

Welfare Schemes in NTR Government: నిండైన రూపం.. మెండైన తేజం.. నిబద్ధతకు నెలవు.. క్రమశిక్షణ కొలువు.. ప్రణమిల్లే సుగుణం.. ప్రభవిల్లే రాజసం.. మన నందమూరి తారక రాముడు. ప్రయోగాల చిరునామా.. విజయాల వీలునామా.. తెరవెలుగుల ధీరుడు.. తలవంచని యోధుడు.. మనమెరిగిన రాముడు మన మదిలో కృష్ణుడు.. అన్న ఎన్టీవోడు. నిరుపేదకు గూడై.. అతివకు చేదోడై.. అన్నదాతకు తోడై.. చేనేతలకు నీడై.. సంక్షేమ స్ఫూర్తి... సుపరిపాలన దీప్తి అందించిన యోధుడు మన అన్నగారు.
తెలుగునాట సంక్షేమం మాటెత్తగానే... ఠక్కున గుర్తొచ్చే నాయకుడు NTR. సంక్షేమానికి ఆయనో బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ కే కాదు... యావత్ భారతానికీ సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్నగారే. సంక్షేమంతోనే సరిపెట్టకుండా... అభివృద్ధి ఆవశ్యకతనూ గుర్తెరిగి... "సంక్షేమం - అభివృద్ధిని" జోడెడ్ల బండిలా ముందుకు నడిపించిన రథసారథి. పథకాల అమల్లో ప్రత్యేకంగా నిలిచిన నందమూరి... పాలనలోనూ తనదైన మార్క్ చూపించారు. అవినీతి, అక్రమాలకు పాతరేశారు. శాంతిభద్రతలు పరిఢవిల్లేలా చూశారు. అత్యుత్తమ విధానాలతో సుపరిపాలనకు బాటలు వేశారు.