పార్టీ జెండా మోసినందుకు ఇదా బహుమతి? - వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపై వైసీపీ కార్పొరేటర్ ఫైర్
Nellore Atmakur Ward Councillor Allegations: అభివృద్దికి నిధులు కావాలని అడిగినందుకు వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మున్సిపాలిటీలోని వైసీపీ వార్డు కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అవిర్భవించినప్పటి నుంచి పార్టీ కోసమే కష్టపడి పనిచేశానని.. తనపై ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని అన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.. తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని స్థానిక మున్సిపాలిటిలోని 20వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తన వార్డు అభివృద్ధి కోసం నిధులు కావాలని తాను ఎమ్మెల్యేను గతంలో అడిగానని.. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యే ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆత్మకూరులో ఎమ్మెల్యే మద్యం షాపుల లీజులను మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏఎస్ పేట, ఆత్మకూరులోని మద్యం షాపులకు ప్రభుత్వం కేటాయించిన లీజును తొలగించి.. ఎమ్మెల్యేకు అనుగుణంగా ఉన్నవారికి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.