'నేను బతికే ఉన్నాను, టీడీపీ నాయకుడిని అయినందుకు ఓటు తీసేస్తారా?': ఓటరు జాబితాలో వెలుగుచూసిన అక్రమాలు
Negligence of Officials in Preparing Voter List : ఓటరు జాబితా రూపకల్పనలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలానికి చెందిన.. టీడీపీ సీనియర్ నాయకుడు, మండల మాజీ కన్వీనర్ వెంకట్రామి రెడ్డి ఊరిలో లేరు అనే కారణంతో ఓటరు జాబితా నుంచి తన ఓటును అధికారులు తీసివేశారు. ఈ నేపథ్యంలో ఆయన 'గ్రామంలో నేను బ్రతికే ఉన్నాను' అని ప్లకార్డుతో బెళుగుప్ప తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక ఎంఆర్ఓ ఓబులేసు ఎదుట తాను గ్రామంలో ఉన్నా.. లేన్నట్లుగా గుర్తించి.. ఓటరు జాబితా నుంచి ఓటు ఎలా తీసివేస్తారని ప్రశ్నించారు.
గతంలో టీడీపీ సీనియర్ నాయకుడుగా ఉన్నందుకే వైసీపీ నాయకులు తన ఓటును తీసి వేశారని ఆరోపించారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల గతి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే.. తహశీల్ధారు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నాని తెలిపారు. అధికారులు తన ఓటరు తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని కోరుకున్నారు.